Site icon HashtagU Telugu

YS Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy

New Web Story Copy (13)

YS Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు భారీగా కోఠీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే అవినాష్ రెడ్డిని మాత్రమే లోపలికి అనుమతించారు పోలీసులు.

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుల్లో ఒకరైన వివేకానంద రెడ్డి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు మార్చి 15, 2019 రాత్రి కడప జిల్లా పులివెందులలోని ఆయన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసును తొలుత రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేసింది. అయితే జూలై 2020లో ఆ కేసు సీబీఐకి బదిలీ అయింది. హత్య కేసులో సీబీఐ 2021 అక్టోబర్ 26న ఛార్జిషీటును, జనవరి 31, 2022న అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేసింది.

కాగా వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట హాజరయ్యారు. అయితే విచారణకు పిలిచి కస్టడీకి తీసుకుంటారని భావించిన ఆయన తరుపు న్యాయవాదులు ముందస్తు బెయిల్‌ కి అప్లయ్ చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ అవినాష్‌రెడ్డిని ఏప్రిల్ 25 వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు మంగళవారం సీబీఐని ఆదేశించింది. అయితే వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్పటి వరకు విచారణ నిమిత్తం ప్రతిరోజూ కేంద్ర ఏజెన్సీ ముందు హాజరు కావాలని హైకోర్టు అవినాష్‌ను ఆదేశించింది.అవినాష్ రెడ్డి విచారణ అంతా ఆడియో-వీడియో రికార్డ్ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది.

వివేకానంద రెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ ఏప్రిల్ 16న అరెస్ట్ చేసింది. హత్యకేసును విచారిస్తున్న సీబీఐ అవినాష్ రెడ్డికి ఏప్రిల్ 17న సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.