Site icon HashtagU Telugu

Bengal Tiger Roars: ఏపీలో ‘టైగర్’ టెర్రర్!

Tiger

Tiger

ఒకే ఒక పులి జిల్లా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అడవి నాదే.. ఊరు నాదే అంటూ స్వైర విహారం చేస్తోంది. ఆవు, మేక, గొర్రె ఏదీ కనిపించినా మీద పడి దాడి చేస్తోంది. ఇక రాత్రి పడితే చాలు గ్రామస్తులు ఎవరూ కూడా గడప దాటేందుకు సాహించడం లేదు. ఇక ఫారెస్ట్ అధికారులకు తలనొప్పిగా మారింది. అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో బెంగాల్ టైగర్ కేసు సవాల్ గా మారింది. పులి కోసం బోను ఏర్పాటుచేసినా చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటోంది. ఈ నేపథ్యంతో కాకినాడ జిల్లా ప్రజలు రాత్రి సమయంలో అడుగు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ప్రస్తుతం ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోని గ్రామాల్లో ఈ మగపులి సంచరిస్తున్నట్లు సమాచారం. జూన్ 8న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో పగ్ (కాలి) గుర్తులు కనిపించాయి. జూన్ 9న ప్రత్తిపాడు మండలంలో కనిపించినట్టే కనిపించి ఎస్కేప్ అయ్యింది. లింగంపర్తి గ్రామంలో పశువులను చంపేందుకు ప్రయత్నించిందని స్థానికులు బోరున ఏడుస్తూ చెప్పారు.

అయితే జూన్ 7వ తేదీ నుంచి పులికి ఆహారం దొరకడం లేదని పలువురు భావిస్తున్నారు. ప్రత్తిపాడు మండలంలోని పెదశంకరపూడి, వంతాడ, కొండ తిమ్మాపురం, ఉలిగోగుల గ్రామాల్లో తిరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నానికి లింగంపర్తి నుంచి ఒమ్మంగి పొదురుపాకకు పులి కదలికలు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. అయితే అటవీశాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు. మరోవైపు పోతులూరు, ఒమ్మంగి గ్రామాల్లో అటవీశాఖ అధికారులు బోనులు, కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు రోజుల క్రితం లింగంపర్తిలో పగ్ గుర్తులు కనిపించాయని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి ఐకేవీ రాజు తెలిపారు. పులి జాడ కోసం డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు. కానీ ఫలించలేదు. దీంతో ఏపీలో బెంగాల్ టైగర్ కేసు మిస్టరీగానే మారింది.

Exit mobile version