Site icon HashtagU Telugu

AP Maha Padayatra: మ‌హాపాద‌యాత్ర‌పై `ఉత్త‌ర` మంత్రాంగం!

Whatsapp Image 2022 10 08 At 12.18.01 Pm

Whatsapp Image 2022 10 08 At 12.18.01 Pm

అమ‌రావ‌తి టూ అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు రైతులు చేప‌ట్టిన మ‌హా పాద‌యాత్ర‌పై వైసీపీ ఉత్త‌రాంధ్ర లీడ‌ర్లు మాట‌ల యుద్ధానికి దిగారు. మంత్రులు గుడివాడ అమ‌ర్నాథ్‌, బొత్సా స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌దిత‌రులు ప్ర‌తిరోజూ యాత్ర‌ను ఏదో ఒక ర‌కంగా విమ‌ర్శిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌పైన దాడి మాదిరిగా ఫోక‌స్ చేస్తున్నారు. ఇదంతా చంద్ర‌బాబు చేస్తోన్న కుట్ర‌గా ఆరోపిస్తూ పార్టీల మ‌ధ్య వైరంగా అమ‌రావతి రాజ‌ధాని ఇష్యూని డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

మూడు రాజ‌ధానులు ప్ర‌కటించడాన్ని నిర‌సిస్తూ చంద్ర‌బాబు జోలె ప‌ట్టిన సంద‌ర్భంలోనూ ఇలాగే జ‌రిగింది. ఆయ‌న రాయ‌ల‌సీమ‌, గోదావ‌రి జిల్లాల నుంచి విశాఖ‌కు అడుగు పెట్ట‌గానే కొంద‌రు చెప్పులు, కోడిగుడ్ల‌తో దాడి చేశారు. దాడికి దిగిన వాళ్లు వైసీపీ కార్య‌క‌ర్త‌లుగా అప్ప‌ట్లో టీడీపీ నిరూపించింది. క‌ర్నూలు, విశాఖ‌ప‌ట్నం మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో చంద్ర‌బాబు జోలె ప‌ట్ట‌డం ద్వారా విరాళాల‌ను భారీగా సేకరించారు. ఏపీ వ్యాప్తంగా అమ‌రావ‌తికి మ‌ద్ధ‌తు ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు ఆనాడు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ అమ‌రావ‌తి రైతులు మూడు ప్రాంతాల్లోనూ మ‌హాపాద‌యాత్ర‌ను చేస్తున్నారు.

ఇటీవ‌ల అమ‌రావ‌తి టూ తిరుప‌తి మ‌హాపాద‌యాత్ర‌ను చేప‌ట్టారు. ఆ యాత్ర‌కు దారిపొడ‌వునా సానుకూల స్పంద‌న ల‌భించింది. ద‌క్షిణాంధ్రకు వెళ్లిన త‌రువాత వ్య‌తిరేక‌త ఉంటుంద‌ని వైసీపీ భావించింది. కానీ, ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మ‌హాపాద‌యాత్ర‌కు ఆద‌ర‌ణ ల‌భించింది. రెండో విడ‌తగా అమ‌రావ‌తి టూ అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు మ‌హాపాద‌యాత్ర‌ను రైతులు చేస్తున్నారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల వ‌ర‌కు యాత్ర వెళ్లింది. అక్క‌డి వ‌ర‌కు ప్ర‌జాద‌ర‌ణ అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు ల‌భించింది. శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం,విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌కు ఎంట్రీ అయిన త‌రువాత ఎలా ఉంటుంది? అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌ర అంశం.

మూడు రాజ‌ధానులు వ‌ద్దు- అమ‌రావ‌తి ముద్దు అనే నినాదాల‌తో సాగుతోన్న మ‌హాపాద‌యాత్ర‌కు టీడీపీ, జనసేన, సీపీఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ మ‌ద్ధ‌తు ప‌లుకుతూ రైతుల‌తో క‌లిసి న‌డుస్తున్నారు. కానీ, వైసీపీ క్యాడ‌ర్ మాత్రం వ్య‌తిరేకంగా ఉంది. మంత్రుల మాట‌ల‌తో క్యాడ‌ర్ కూడా రెచ్చిపోవ‌డానికి సిద్ధంగా ఉంది. అయితే, హైకోర్టు ప్ర‌త్యేక అనుమ‌తుల‌తో సాగుతోన్న ఆ యాత్ర‌కు భ‌ద్ర‌తను జ‌గ‌న్ స‌ర్కార్ క‌ల్పించాలి. అందుకే, ఆచితూచి వైసీపీ నేత‌లు అడుగు వేస్తున్నారు. మీడియా వేదిక‌గా ప్ర‌తిరోజూ ఏదో ఒక రూపంలో యాత్ర‌ను డామేజ్ చేసేలా మాట‌ల యుద్ధాన్ని కొన‌సాగిస్తున్నారు. దానికి ఆజ్యం పోస్తూ ఉత్త‌రాంధ్ర కో ఆర్డినేట‌ర్‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మ‌హాపాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని సూచించ‌డం గ‌మ‌నార్హం.

వైసీపీ అగ్ర‌నేత‌లు అంద‌రూ మ‌హా పాద‌యాత్ర‌ను ప‌లు ర‌కాలుగా ప‌లుచ‌న చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలోనూ చంద్ర‌బాబు విశాఖ జోలె ప‌ట్ట‌డానికి వెళ్లిన‌ప్పుడు ఇలాగే జ‌రిగింది. ఇప్పుడు మ‌హాపాద‌యాత్ర కూడా ఉత్త‌రాంధ్ర‌కు ఎంట్రీ కాగానే ర‌చ్చ అయ్యే ఛాన్స్ ఉంది. ఆనాడు చంద్ర‌బాబును విమానాశ్ర‌యం నుంచి వెనుక్కు పంపించిన వైనం గుర్తుండే ఉంటుంది. అలాగే, మ‌హాపాద‌యాత్ర‌కు ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దుల్లో బ్రేక్ ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆ లోపుగా లా అండ్ ఆర్డ‌ర్ కంట్రోల్ లో పెట్ట‌డానికి వీల్లేని ప‌రిస్థితుల‌ను క‌ల్పించేలా వైసీపీ మూడు రాజ‌ధానుల‌కు అనుకూలంగా ఉత్త‌రాంధ్ర జ‌నంతో ర్యాలీలు చేయించ‌డానికి సిద్దం అవుతోంది. మొత్తం మీద మూడు రాజ‌ధానుల అంశాన్ని బేస్ చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నుకుంటోన్న వైసీపీకి మ‌హాపాద‌యాత్ర క‌లిసొచ్చేలా మ‌లుచుకోనుంద‌న్న‌మాట‌.