Site icon HashtagU Telugu

YCP Strategy: గడపలకు తిరుగుతూ మళ్లీ బస్సెక్కడమేంటి?

Modi Jagan Kcr

Modi Jagan Kcr

వైఎస్ జగన్ ఎక్కడా తగ్గడం లేదు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలను గడప గడపకు పంపిస్తున్నారు. ఓవైపు ఇది జరుగుతుండగానే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఒక పార్టీ ఒకేసారి ఇలా రెండు కార్యక్రమాలు చేపట్టడం చాలా అరుదు. అసలు అలాంటి ఆలోచనే రాదు కూడా. కాని, వైఎస్ జగన్ మాత్రం విభిన్నంగా ఆలోచించినట్టు కనిపిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర పేరుతో ఓ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ బస్సు యాత్రలో 17 మంది మంత్రులు మాత్రమే పాల్గొంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు ఈ బస్సుయాత్ర చేపడతారు. 26వ తేదీన ఉత్తరాంధ్రలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 29వ తేదీన రాయలసీమలోని అనంతపురంలో ముగుస్తుంది. సరిగ్గా వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న సందర్భంగా ఈ యాత్ర చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఈ బస్సు యాత్రలో నాలుగు చోట్ల భారీ బహిరంగ సభలు కూడా పెట్టనున్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని పాటించింది ఒక్క వైసీపీనేనని చాటి చెప్పేందుకు ఈ యాత్ర చేపడుతున్నామని వైసీపీ తెలిపింది.

అయితే, ఓవైపు గడప గడపకు తిరుగుతుంటే మళ్లీ బస్సు యాత్ర చేయడమేంటని పార్టీలోని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. నిజానికి గడప గడప కార్యక్రమం పెద్దగా సక్సెస్ అవడం లేదనేది టాక్. మంత్రి లేదా వైసీపీ ఎమ్మెల్యే కనిపిస్తే చాలు నిలబెట్టి నిలదీస్తున్నారు. దీంతో బస్సు యాత్ర పేరుతో ప్రజల దృష్టి మరల్చి వ్యతిరేకతను పోగొట్టుకునే పనిలో ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే, ఇళ్లకు వెళ్తున్న వారినే ప్రజలు
ప్రశ్నిస్తున్నప్పుడు.. బస్సు యాత్ర చేస్తున్న మంత్రులను మాత్రం జనం ప్రశ్నించరా అనే ప్రశ్న వినిపిస్తోంది. కాకపోతే నాలుగు రోజుల్లో రాష్ట్రం మొత్తం చుట్టి వస్తారు కాబట్టి పెద్దగా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.