Site icon HashtagU Telugu

YCP Plenary: వైసీపీ ప్లీనరీ వాయిదా? అందుకోసమేనా?

Ysrcp Plenary

Ysrcp Plenary

YCP Plenary: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమై ఉన్నారు. పార్టీ ముఖ్య నేతలు కూడా యాక్టివ్ మోడ్‌లో లేకపోవడంతో, గ్రౌండ్ లెవెల్ క్యాడర్‌లో తీవ్ర నిస్పృహ నెలకొంది.

ఈ ఏడాదైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లీనరీ నిర్వహిస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. జగన్, ప్లీనరీని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల, నాయకులు, అభిమానుల్లో అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. “వైసీపీ అధ్యక్షుడి లెక్కలేంటి?” అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

ప్లీనరీల చరిత్ర – పార్టీ రాజకీయ మార్గదర్శకానికి వేదిక

వైసీపీ స్థాపన తర్వాత ఇప్పటి వరకు రెండు ప్లీనరీలను ఘనంగా నిర్వహించింది. 2017లో విపక్షంగా ఉన్న సమయంలో జరిగిన మొదటి ప్లీనరీలో ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా పరిచయం చేసి, అదే సమావేశం తర్వాత నవంబర్ 6న జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్రే 2019లో పార్టీ అధికారంలోకి రావడడానికి కీలకంగా మారింది.

అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో రెండో ప్లీనరీ జరిగింది. అందులోనే జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అంగీకరించలేదన్న ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.

2026 ప్లీనరీకే దృష్టి – బూత్ స్థాయిలో నిర్మాణమే లక్ష్యం

పార్టీ మరల బలపడాలంటే, దాని పునర్నిర్మాణం బూత్ స్థాయి నుంచే మొదలవాలి అన్నది జగన్ ఆలోచన. ఈ లోగా పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణం – అంటే బూత్ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయిలకు కమిటీల ఏర్పాటు – కీలకంగా మారింది.

ఈ విషయాలపై జగన్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశమయ్యారన్న సమాచారం ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, 2026 జూలైలో భారీగా ప్లీనరీ నిర్వహించాలన్నది జగన్ ప్రణాళిక. అంతవరకు పార్టీని శక్తివంతంగా మార్చేందుకు, పార్లమెంటరీ పరిశీలకులు, రీజనల్ కోఆర్డినేటర్లు సమిష్టిగా పని చేయాలని సూచించారు.

పార్టీ బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న పార్లమెంటరీ పరిశీలకులు

వైసీపీని తిరిగి పటిష్టంగా తయారు చేయాలంటే, నియోజకవర్గాల్లో ఇన్చార్జ్‌లు ప్రజల్లో ఉండేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటరీ పరిశీలకులదే అని జగన్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి వరకూ వైసీపీలో జగన్‌దే ఒక్కడి నాయకత్వం అని చెప్పే భావన హావభావాల్లో కనిపించింది. తన ఛాయలే ఓటు వేయించగలవని నమ్మిన ఆయన, ఇప్పుడు బాధ్యతలు ఇతర నేతలపై వేయడం చూస్తూ పార్టీలోనే కొంతమంది ఆశ్చర్యపోతున్నారు.

వైసీపీ ఎలా ఉండాలో దేశానికి చూపించిందని జగన్ వ్యాఖ్య

ఓటమి తర్వాత బెంగళూరు, తాడేపల్లి మధ్య షటిల్ అవుతున్న జగన్, పార్టీ నేతలతో సమీక్షలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, రాష్ట్రంలో చట్టబద్ధత క్షీణిస్తోందని ఆరోపించారు. బలహీన సంఖ్యాబలం ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికలకు దూకుడుగా వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కూడా విమర్శించారు.

“నాయకుడు ఎలా ఉండాలో చెప్పాలంటే వైసీపీని చూడాలి” అంటూ జగన్ అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ఎప్పుడూ ఇచ్చిన హామీలను తప్పక నెరవేర్చిందని చెప్పారు. కరోనా కాలంలో కూడా ప్రభుత్వ పాలనలో వెనక్కి తగ్గలేదని, ప్రతి నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకున్నామని అన్నారు.

మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమాతో జగన్

మళ్లీ అధికారంలోకి వచ్చేది తానే అన్న ధీమాతో పోలీసులకు స్ట్రాంగ్‌ వార్నింగులు ఇస్తున్నా జగన్‌. తమ కార్యకర్తల జోలికొస్తే వదిలిపెట్టమని, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే ఇక్కడకి రప్పించి సినిమా చూపిస్తామని హెచ్చరిస్తూ క్యాడర్‌లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. తమ కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదలమని హెచ్చరిస్తున్నారు.

ప్లీనరీ వాయిదా – వైసీపీలో నిరాశ గాలులు

ఈ సంవత్సరం కూడా ప్లీనరీ సమావేశాన్ని వాయిదా వేయడంపై వైసీపీ నేతలూ, కార్యకర్తలూ తీవ్ర నిరాశలో ఉన్నారు. ప్రతీసారి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరగాల్సిన ఈ పార్టీ సమ్మేళనం వాయిదా పడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే జగన్ వచ్చే ఏడాది ప్లీనరీని జరపాలని సూచించినా, ఇప్పటివరకు ఉత్సాహంగా ఉన్న నేతలు కూడా నిరాశలో ఉన్నారు.

వచ్చే ఏడాది జూలై 8న వైసీపీ ప్లీనరీ – కానీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం కొరత

వాస్తవానికి వైసీపీ ప్లీన‌రీ అనేది అధికారంలో ఉన్నా.. లేకున్నా ఘ‌నంగా నిర్వహించాల్సిన పార్టీ పండుగ. టీడీపీ మహానాడు ప్రతిసారి అంగరంగ వైభవంగా జరుగుతుంటుంది. అలాగే జూలై 8న దివంగత మాజీ సీఎం వై ఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి జ‌యంతిని పుర‌స్కరించుకుని వైసీపీ ప్లీనరీని నిర్వహించాలని పార్టీలో తీర్మానం చేశారు. అయితే.. గ‌త ఏడాది పార్టీ ఓడిపోయిన నేప‌థ్యంలో ప్లీన‌రీ ఊసే లేకుండా పార్టీ అవిర్భావ కార్యక్రమాలు సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సంవ‌త్సరం అయినా..పార్టీ ప్లీన‌రీని ఘ‌నంగా నిర్వహించి క్యాడర్‌కు దిశానిర్ధేశం చేస్తారని భావించారు.

జిల్లాల్లో పర్యటనలు కూడా గాలిలో కలిసిపోయాయి

జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలు చేస్తానని చెప్పినా, ఇప్పటివరకు ఎటూ కదలలేదు. ఆయన బయటకు రావడం తగ్గించడంతో పాటు, పలువురు నాయకులు కూడా ప్రజల్లో కనిపించడం లేదు. బూత్ స్థాయిలో కార్యకర్తలు డీలాపడ్డారు. ఈ పరిస్థితుల్లో క్యాడర్‌కు నూతన ఉత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

నాయకుల లోటుతో ప్లీనరీ పెట్టాలా? అనే సంకోచం

ప్రస్తుతం అనేక నియోజకవర్గాల్లో నాయకుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నవారిలోనూ జోష్ లేదు. అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ చుట్టూ తిరిగిన నేతలే ఇప్పుడు ముందుకు రావడం లేదు. అలాంటి తత్వంలో ప్లీనరీ పెట్టినా అది పెద్దగా ప్రభావం చూపదన్న భావనతోనే జగన్ వాయిదా వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తానికి వైసీపీ ఆత్మపరిశీలనలో ఉంది

ఈ పరిస్థితులన్నింటికీ ముడిపడి, వైసీపీ రాజకీయాల్లో స్పష్టత కొరత, స్థిరత్వం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. 2026లో బలమైన సంస్థాగత నిర్మాణంతో, కొత్త ఉత్సాహంతో ప్లీనరీ జరపాలని జగన్ యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల మాట.