Site icon HashtagU Telugu

Vijay Sai Reddy : ఏపీకి వరద సాయం కింద రూ.1000 కోట్లు ఇవ్వండి

Vijaysaireddy

Vijaysaireddy

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రాయలసీమ జిల్లాలలో పాటు నాలుగు దక్షిణ కోస్తా జిల్లాల్లో అసాధారణ వర్షాలతో సంభవించిన వరదలతో పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. సుమారు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ఆచూకీ దొరకలేదు. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తక్షణ సాయం కింద రూ.1000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల అంశాన్ని శ్రీ విజయసాయి రెడ్డి ఈరోజు రాజ్యసభ జీరో అవర్‌లో లేవనెత్తుతూ తక్షణ సాయం కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 16 నుంచి 18 తేదీల మధ్య దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురిసిన అసాధారణ వర్షాల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇళ్ళు కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు, రైలు పట్టాలు, విద్యుత్‌ లైన్లు, స్తంభాలు వరదలో కొట్టుకుపోయాయి. వరదలు ముంచెత్తడంతో కొన్ని జలాశయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోతలకు సిద్ధమైన పంట వరద నీటిలో కొట్టుకుపోయింది. సుమారు లక్షా 85 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు ధ్వంసమైపోయాయి.

ప్రాధమిక అంచనాల ప్రకారం రూ.6,054 కోట్ల రూపాయల పంట, ఆస్తి నష్టం జరిగిందని విజయసాయి రెడ్డి వివరించారు. వరద ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టింది. వరదలతో అతలాకుతలమైపోయిన బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలను ప్రారంభించింది. ఈ విపత్కర పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం అర్ధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రానికి వేయి కోట్ల రూపాయల తక్షణ సహాయం ప్రకటించాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.