Viveka Murder : వివేక మర్డర్ కేసులో వైసీపీ ఎంపీకి బిగుస్తున్న ఉచ్చు.. నేడు సీబీఐ విచార‌ణ‌కు తండ్రీకొడుకులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సూత్ర‌ధారులు, కుట్ర‌దారులు

  • Written By:
  • Publish Date - March 6, 2023 / 06:58 AM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో సూత్ర‌ధారులు, కుట్ర‌దారులు ఇద్ద‌రు వైఎస్ వివేకానంద రెడ్డి సోద‌రుడు భాస్క‌ర్ రెడ్డి, ఆయ‌న కుమారుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అని సీబీఐ ఇప్ప‌టికే నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఇద్ద‌ర్ని విచార‌ణ‌కు రావాల‌ని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు జారీ చేసి ఈరోజు (సోమవారం) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. . సోమవారం హైదరాబాద్‌లోని సీబీఐ ప్రిన్సిపల్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ కోరింది. ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిని క‌డ‌ప సెంట్ర‌ల్ జైల్‌లోని గెస్ట్ హౌస్‌లో ఈ రోజు(సోమ‌వారం) విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం పులివెందులకు వెళ్లి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, ఆయన తండ్రికి శనివారం అర్థరాత్రి నోటీసులు అందజేసింది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని ఈరోజు (సోమవారం) మూడోసారి విచారించనున్నారు. ఆయన గత నెలలో రెండుసార్లు సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రైయ్యారు.

కాగా తాజా పరిణామంలో తనకు ఇద్దరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ3 నిందితుడు ఉమాశంకర్‌రెడ్డి భార్య గుజ్జుల స్వాతి ఆదివారం ఎస్పీ అన్బురాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఇద్దరూ పులివెందుల పట్టణ వాసులని ఫిర్యాదులో పేర్కొంది. . శనివారం సాయంత్రం పరమేశ్వర్‌రెడ్డి, అతని కుమారుడు తన ఇంటికి వచ్చి తనను దుర్భాషలాడారని, చెప్పుళ్లతో కొట్టారని ఆమె ఫిర్యాదు చేసింది. ఇద్దరూ తనను చంపుతామని బెదిరించారని ఆమె ఆరోపించింది. స్వాతి ఫిర్యాదు మేరకు పులివెందుల పట్టణంలోని ఆమె నివాసానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.