YS Jagan: వైసీపీలో ధిక్కార స్వరం.. పార్టీపై జగన్ కు పట్టు చేజారుతోందా?

భయపడితే అన్నీ భయాలే.. తెగిస్తే ఏదీ లేదు. వైసీపీలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారు..

  • Written By:
  • Publish Date - April 19, 2022 / 09:38 AM IST

భయపడితే అన్నీ భయాలే.. తెగిస్తే ఏదీ లేదు. వైసీపీలో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవారు.. మాజీ మంత్రులుగా మిగిలిపోయినవారు ఇలాగే ఆలోచిస్తు్న్నట్టు కనిపిస్తోంది. లేకపోతే నిన్న మొన్నటి వరకు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడడానికే భయపడ్డ వైసీపీ నేతలు ఇప్పుడు ఆయనను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. అసంతృప్తి, అసమ్మతి, ధిక్కారధోరణి.. ఇవన్నీ వైసీపీలో ఇన్ని రోజులూ బయటకు రాలేదు. ఇప్పుడు బహిరంగంగానే కనిపిస్తు్న్నాయి. వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు చేసిన సంచలన వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనం.

తనకు మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీ అధిష్టానమే దెబ్బకొట్టిందని గొల్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పైగా లక్ష శాతం తాను హింసావాదినే అనడం దేనికి సంకేతం? తానేమీ అయాకుడిని కానని… అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. తనపై ఆశలు పెట్టుకున్న లక్ష మందికి ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ చనిపోయిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. పార్టీ కోసం అన్నీ త్యాగం చేశానన్నారు. సీఎం పిలవకుండా ఆయన దగ్గరకు తానెందుకు వెళ్తానని తేల్చి చెప్పేశారు. కోటవురట్ల వాలంటీర్ సన్మాన సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి.

2019 ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన తరువాత జగన్ మాటకు పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని ఎదురు లేకుండా పోయింది. మాట తప్పినా, మడమ తిప్పినా ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత సీన్ మొత్తం మారిపోయింది. ఒత్తిళ్లకు తలొగ్గి 11 మంది పాతవారినే మళ్లీ మంత్రులుగా కొనసాగించడంతో విభేదాలు రాజుకున్నాయి. దీంతో మంత్రి పదవులు కోల్పోయినవారు ఫైరయ్యారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. సుచరిత, బాలినేని వంటివారు అలిగారు.

జగన్ మాట తప్పారని సామినేని ఉదయభాను, కొలుసు పార్థసారథి, కరణం ధర్మశ్రీ, గొల్లబాబూరావు లాంటివారు కస్సుబుస్సులాడారు. గొల్లబాబూరావు అయితే ఏకంగా వందల మంది కార్యకర్తలను తాడేపల్లికి తీసుకువచ్చి సీఎం క్యాంపు కార్యాలయానికి దగ్గరలోనే నిరసన తెలపడంతో అధిష్టానమే షాకైంది. దూతలను పంపించినా ఇలాంటి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో చివరకు జగనే స్వయంగా వీరికి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఎంతో సీరియస్ మ్యాటర్ అయితే తప్ప కలగజేసుకోని జగన్.. ఇప్పుడు ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారంటున్నాయి వైసీపీ వర్గాలు.