Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థాన‌చ‌ల‌నం.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ..?

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 06:02 PM IST

నెల్లూరు జిల్లా వైసీపీలో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించిన అధిష్టానం నెల్లూరు జిల్లాలో కూడా ప‌లువురు ఎమ్మెల్యేల‌కు స్థాన‌చ‌ల‌నం ల‌భించ‌నుంది. నెల్లూరు సిటీలో గ‌త రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌ని చేసిన అనిల్ కుమార్ యాద‌వ్‌ని మార్చాల‌ని అధిష్టానం భావిస్తుంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేయాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ముగ్గురు ఎమ్మెల్యే అభ్య‌ర్థులను మారిస్తేనే తాను పోటీ చేస్తాన‌ని అధిష్టాన‌నికి చెప్పిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే వైసీపీ అధిష్టానం నెల్లూరు జిల్లాలో అభ్య‌ర్థుల మార్పు ఉంటుంద‌ని సంకేతాలు ఇచ్చింది. అందుకోస‌మే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేల‌తో భేటీ అవుతున్నారు. తాజాగా కావ‌లి ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి తో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాద‌వ్ భేటి అవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కావ‌లి నుంచి అనిల్ పోటీ చేస్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కావ‌లిలో బీసీ సామాజివ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో అనిల్‌ని అక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని అధిష్టానం ప్లాన్ చేస్తుంది. అయితే అనిల్ యాద‌వ్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి అంటిముంట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించారు. ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భగ్గుమ‌నేలా విభేదాలు ఉన్నాయి. అనిల్ మంత్రి ప‌ద‌వి పోయిన త‌రువాత అదే జిల్లా నుంచి మంత్రిగా కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి కావ‌లిలో కాకాణికి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. తాజాగా అనిల్ కుమార్ యాద‌వ్ ప్ర‌తాప్‌కుమార్ రెడ్డిని క‌ల‌వ‌డం అంద‌రిని అశ్చ‌ర్యానికి గురి చేసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనిల్ కావ‌లి నుంచి పోటీ చేస్తున్నందున మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఎమ్మెల్యే ప్ర‌తాప్‌కుమార్ రెడ్డిని క‌లిసిన‌ట్లు తెలుస్తుంది. ఇదే జ‌రిగితే కావ‌లిలో అనిల్ కుమార్ యాద‌వ్‌కి ప్ర‌తాప్‌కుమార్ రెడ్డి ఎంత వ‌ర‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Also Read:  TTD: టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాలకు గ్రీన్ సిగ్నల్