ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో (AP Elections) ఘోర పరాజయం చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP ) నేతలు..ఫలితాల అనంతరం మౌనం పాటించినా, ఇప్పుడు మళ్లీ నోరుతెరుస్తూ మళ్లీ అవే బూతులు పేలుస్తున్నారు. ఎన్నికల ముందు కనిపించిన విమర్శల ధోరణి, వ్యక్తిగత దూషణలు మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి ఆర్కే రోజా, లక్ష్మీ పార్వతి, పేర్ని నాని(Roja, Lakshmi Parvathi, Perni Nani) వంటి నాయకులు తెగ ఆగ్రహావేశాలతో వ్యాఖ్యలు చేస్తుండటంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ప్రజలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, తిరిగి పాత స్థాయి విమర్శలు చేయడాన్ని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ఖండిస్తున్నారు.
Jamili Elections : జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
రోజా తిరిగి “రబ్బర్ సింగ్”, “వెంట్రుక పీకలేరు” వంటి పాత పదజాలంతో పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో తలెత్తిన అంతర్గత సమస్యలతో కాస్త తగ్గిన రోజా, ఇప్పుడు పునఃప్రవేశంతో మళ్లీ పాత తీరుకే మళ్లారు. అలాగే లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లపై దూషణాత్మక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లోకేష్‌ను “షాడో సీఎం”గా, పవన్‌ను “వేస్ట్ ఫెలో”గా సంబోధిస్తూ ఆమె మాటలలో కఠినత వదలలేదు. గత ప్రభుత్వ తీరును విమర్శించడంలో కాకుండా, వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేయడం వ్యతిరేకతను కలిగిస్తోంది.
ఇటీవల కోర్టుల్లో ఊరట లభించడంతో పేర్ని నాని కూడా వాడి వేడి విమర్శలకు దిగారు. హోం శాఖ అనేది జగన్‌పై కేసులు పెట్టే శాఖగా మారిందని వ్యాఖ్యానించిన ఆయన, హోం మంత్రి తానేటి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహానటి అంటూ చేసిన వ్యాఖ్యా వెటకారంగా మారింది. మొత్తంగా చెప్పాలంటే, వైసీపీ నేతలు మళ్లీ పాత బూతు ధోరణిని తిరిగి ప్రారంభించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల అభిప్రాయం, రాజకీయ వ్యూహాలపై దృష్టిపెట్టాల్సిన సమయంలో వ్యక్తిగత దూషణలు కొనసాగించటం, పార్టీ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది.