Site icon HashtagU Telugu

YSRCP : వైసీపీలో విభేదాలు తారాస్థాయికి.. విజయసాయిరెడ్డి – కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Kethireddy Venkatarami Reddy, Vijayasai Reddy

Kethireddy Venkatarami Reddy, Vijayasai Reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అంతర్గత విభేదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేసిన తర్వాత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి దీని పై తీవ్ర స్థాయిలో స్పందించడంతో వైసీపీలో తాజా రాజకీయ వేడి మరింత పెరిగింది.

విజయసాయిరెడ్డి ఏమన్నారంటే?
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించిన విజయసాయిరెడ్డి, తన వ్యక్తిత్వ integrity గురించి ఓ ఎక్స్ (Twitter) పోస్ట్ చేశారు. “నాకు వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయత ఉన్నవాడిని, అందుకే ఎవరికి ఏ ప్రలోభాలకూ లొంగలేదు” అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, “భయం అనే అణువు నా శరీరంలో లేదు. అందుకే రాజ్యసభ పదవి, పార్టీ పదవులు, మొత్తం రాజకీయాలనే వదులుకున్నాను” అంటూ రాజకీయాల నుండి తప్పుకోవడంపై మరోసారి స్పష్టత ఇచ్చారు.

ఇప్పటికే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, ఇకపై ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా వ్యవసాయం చేసుకుంటూ జీవితం కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ ప్రకటనతో వైసీపీలో జగన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అనూహ్యంగా తప్పుకోవడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

 Orange: ఆరెంజ్ తిన్నప్పుడు పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి.. తిన్నారో!

కేతిరెడ్డి కౌంటర్:
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. “రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉన్న నాయకుడు ఎవరన్నది ప్రజలకు బాగా తెలుసు” అంటూ విజయసాయిరెడ్డిని తిప్పికొట్టారు.

తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, “కనీస రాజకీయ నేపథ్యం లేకపోయినా, ఆడిటర్‌గా ఉన్న వ్యక్తి అన్ని హోదాలు, అన్ని పదవులు అనుభవించాడు. పార్టీ పెద్దగా గౌరవిస్తే, ఆయన బయటకు వెళ్లిన తర్వాత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే వైయస్ కుటుంబ పరువును బజారుకి ఈడ్చినట్లే” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అంతేకాదు, “ఇది ఎవరి కనుసన్నల్లో జరుగుతోందో, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు” అంటూ విజయసాయిరెడ్డిపై కక్ష సాధింపు రాజకీయాలు ఉన్నాయని సూచించేలా వ్యాఖ్యలు చేశారు.

వైసీపీకి ఎదురు గాలి?
వైసీపీకి చెందిన కీలక నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం కొత్తేం కాదు. కానీ, విజయసాయిరెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడిన తర్వాత ఇటువంటి మాటల యుద్ధం మరింత రాజుకుంటోంది. ఆయన ప్రస్థానం వైసీపీ విజయానికి, పార్టీలో కీలక నిర్ణయాలకు ఎంతో ప్రభావం చూపిన నేపథ్యంలో, ఇలాంటి భేదాభిప్రాయాలు జగన్ పార్టీని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఈ వివాదంపై విజయసాయిరెడ్డి మరోసారి స్పందిస్తారా? కేతిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి సమాధానం ఇస్తారా? అన్నది చూడాలి. ఏపీలో రాజకీయ ఉత్కంఠ మరింత పెరిగింది.

Bhatti Meet Finance Minister: కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసిన భ‌ట్టి.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కోరిన డిప్యూటీ సీఎం