Rythu Bharosa : ‘రైతు భ‌రోసా’ ఖాతాల్లో జ‌గ‌న్మాయ‌

ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌న‌వ‌రి మూడో తేదీన రైతు భ‌రోసా నిధుల‌ను జ‌మ చేస్తూ తాడేప‌ల్లి వ‌ద్ద బ‌ట‌న్ నొక్కాడు.

Published By: HashtagU Telugu Desk
Rythy Bharosa

Rythy Bharosa

ఏపీ సీఎం జ‌గ‌న్ జ‌న‌వ‌రి మూడో తేదీన రైతు భ‌రోసా నిధుల‌ను జ‌మ చేస్తూ తాడేప‌ల్లి వ‌ద్ద బ‌ట‌న్ నొక్కాడు. ఆధార్ కార్డుల నెంబ‌ర్ల‌తో వెబ్ సైట్ లోకి వెళ్లి చూస్తే డబ్బు జ‌మ అయింద‌ని చూపిస్తోంది. కానీ, ఖాతాలో డ‌బ్బు మాత్రం క‌నిపించ‌డంలేదు. కొన్ని వేల మంది రైతుల‌కు ఇలాంటి స‌మ‌స్య ఉంది. వైఎస్సార్ రైతు భ‌రోసా-పీఎం కిసాన్ కింద మూడో విడ‌త స‌హాయం అందాలి. పెట్టుబ‌డి సాయం కింద 50ల‌క్ష‌ల 58వేలా 489 మంది రైతుల‌కు 1036 కోట్లు జ‌మ అయింద‌ని ప్ర‌భుత్వం లెక్క‌. ఆ మేర‌కు జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కాడ‌ని స‌ర్కార్ చెబుతోంది. కానీ, ఖాతాలకు డ‌బ్బు జ‌మ కాలేద‌ని రైతులు ల‌బోదిబో అంటున్నారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యం వాలంటీర్ల‌ను ప్ర‌శ్నిస్తే.. పడిన‌ట్టు చూపిస్తుంద‌ని చెబుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో మాత్రం చాలా మంది రైతుల‌కు జ‌మ కాలేదు.ఈ ఏడాది జ‌న‌వ‌రి మూడో తేదీ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా 1036 కోట్ల‌ను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ బ‌ట‌న్ నొక్కాడు. ఆ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ అయింద‌ని ప్ర‌భుత్వం లెక్క తేల్చింది. గ‌త‌ మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించిన‌ట్టు రికార్డ్ లు చెబుతున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి రూ. 13,500 చొప్పున అర్హులైన రైతుల‌కు పెట్టుబ‌డి స‌హాయం కింద మూడు విడ‌త‌లుగా జ‌గ‌న్ స‌ర్కార్ అందిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం నుంచి పీఎం కిసాన్ కింద రూ. 2వేల చొప్పున జ‌మ అవుతోంది. మూడు విడ‌త‌లుగా రూ. 6వేలు పీఎం కిసాన్ కింద కేంద్రం స‌హాయం అందిస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు రూ. 13,500 ఇవ్వాల్సి ఉండ‌గా, కేంద్రం ఇచ్చే రూ. 6వేలు పోగా మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తోంది.

Pawan Kalyan& Chandrababu : ప్ల‌స్ లో మైన‌స్

కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చే న‌గ‌దు మూడు ద‌ఫాలుగా రాష్ట్ర రైతాంగానికి జ‌మ అవుతోంది. కేంద్రం వాటా కు అర్హులైన రైతుల‌కు రాష్ట్రం వాటా స‌హాయం కూడా జ‌మ కావాలి. కానీ, ఆ విధంగా కొంద‌రు రైతుల విష‌యంలో జ‌ర‌గ‌డంలేదు. వాలంటీర్లు కూడా స‌రైన స‌మాధానం చెప్ప‌కుండా త‌ప్పుకుంటున్నారు. ప్ర‌భుత్వం చెబుతోన్న లెక్క‌ల ప్ర‌కారం మూడో విడతలో 48ల‌క్ష‌ల 86వేలా 361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమ అయింది. గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు జ‌గ‌న్ స‌ర్కార్‌ జమ చేసింది. కొత్తగా సాగుహక్కు పత్రాలు (సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు రైతుల‌కు జ‌మ చేసింది. మొత్తం మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అయింది. సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించాలి. 2019 అక్టోబర్‌ 15న శ్రీకారం చుట్టిన ఈ పథకం కింద తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,162.45 కోట్లు జమ చేయ‌డం జ‌రిగింది. రెండో ఏడాది 2020–21లో 49.40 లక్షల రైతు కుటుంబా లకు రూ.6,750.67 కోట్లు జమ చేసిన‌ట్టు జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతోంది.

Prashant Kishor : మూడు పార్టీల ముద్దుల‌ ‘పీకే’

అకౌంట్లలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకునే అవకాశాన్ని జగన్ సర్కార్ కల్పించింది. వైఎస్సార్ రైతు భరోసా వెబ్‌సైట్‌ (https://ysrrythubharosa.ap.gov.in/)లోకి వెళ్ళి చెక్ చేసుకోవ‌చ్చు. వెబ్ సైట్ లో కనిపించే నో యువర్ రైతుభరోసా స్టేటస్ (Know your Rythu Bharosa Status) మీద క్లిక్ చేయాలి. అక్కడ సంబంధిత రైతు ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేస్తే డబ్బులు అకౌంట్‌లో జమయ్యాయో లేదో తెలుపుతుంది. బ్యాంకులు నుంచి ఇబ్బందులు ఎదురైతే.. 1902 నంబర్‌కు ఫిర్యాదు చేసే వెసుల‌బాటు క‌ల్పించింది. ఈ ప్ర‌క్రియను గ‌మనిస్తే, ఎంతో పార‌ద‌ర్శ‌కంగా ఈ ప‌థ‌కం అమలు అవుతుంద‌ని తెలుస్తోంది. కానీ, డ‌బ్బు మాత్రం రైతుల ఖాతాల‌కు చేర‌డంలేదు. దీన్లో ఉన్న తిర‌కాసు ఏంటో వాలంటీర్లు చెప్ప‌లేక‌పోతున్నారు. 1902కి ఫోన్ చేసినా రిప్లై రావ‌డంలేదు. డ‌బ్బు లేక ఖాతాల్లో జ‌మ కావ‌డంలేద‌ని కొంద‌రు చెబుతున్నారు. సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్క‌గానీ డబ్బు ప‌డిపోయింద‌ని న‌మ్మే ప‌రిస్థితి ఇప్పుడు లేదు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి స‌ర్కార్ రైతుల‌ను ఆదుకోవాల‌ని ప‌లువురు కోర‌డం గ‌మనార్హం.ఇదే స‌మ‌స్య‌పై 1902 నెంబ‌ర్ కు కాల్ చేయ‌గా, డ‌బ్బు డిపాజిట్ అయింద‌ని చెబున్నారు. బ్యాంకులో ఎందుకు జ‌మ‌కాలేద‌ని ప్ర‌శ్నించ‌గా, సంబంధిత అగ్రిక‌ల్చ‌ర్ ఆఫీస‌ర్ ను సంప్ర‌దించాల‌ని స‌ల‌హా ఇవ్వ‌డం జ‌రిగింది. ఆ మేరకే ఏవోను ఓ రైతు క‌ల‌వ‌గా బ్యాంకు వాళ్ల‌ను అడ‌గండ‌ని స‌ల‌హా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. బ్యాంకును సంప్ర‌దించ‌గా, ప్ర‌భుత్వం ఇంకా జ‌మ చేయ‌లేద‌ని అక్క‌డి ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తం మీద మూడో విడ‌త రైతు భ‌రోసా నిధుల విడుద‌ల వెనుక గంద‌ర‌గోళం నెల‌కొంది. దీనికి ప్ర‌భుత్వం ఎప్పుడు ప‌రిష్కారం ఇస్తుందో చూద్దాం.

  Last Updated: 28 Feb 2022, 03:34 PM IST