YSRCP vs TDP: జ‌గ‌న్ స‌ర్కార్ పై.. య‌న‌మ‌ల సీరియ‌స్ కామెంట్స్..!

  • Written By:
  • Publish Date - March 26, 2022 / 03:35 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పై తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు య‌న‌మ‌ల రామ‌కృష్ణ‌డు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో రాష్ట్ర ఆర్థిక‌ప‌రిస్థితి దివాళా తీసింద‌ని, జ‌గ‌న్ హ‌యాంలో ఏపీ ప్ర‌భుత్వం స‌మ‌స్య‌ల్లో కొట్టుమిట్టాడుతోంద‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. వైసీపీ స‌ర్కార్‌కు ఆర్థిక క్రమ శిక్షణ కొరవిడిందని, వాస్తవాలకు విరుద్ధంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతున్నార‌ని య‌న‌మ‌ల మండిప‌డ్డారు.

ఇక కేంద్రం నుంచి రావల్సిన నిధులు, ఇతరత్రా అంశాలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అప్పులు చేస్తోంద‌ని, య‌న‌మ‌ల ద్వ‌జమెత్తారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉందని, శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే ఘోరంగా ఉందని, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు. ఇప్ప‌టికే రెండున్న‌ర ఏళ్ళ పాల‌న‌లో వైసీపీ నేత‌లు 48 వేల కోట్ల రూపాయలు దిగమింగారని య‌న‌మ‌ల‌ ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కోస‌మే ఖ‌ర్చు పెడితే ఆ లెక్క‌లు ఎందుకు చూపెట్ట‌లేక‌పోతుంద‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌శ్నించారు.

ఇక ఏపీ ప్ర‌భుత్వ ప్రస్తుత పరిస్థితి అప్పు చేసి పప్పు కూడు తరహాలో ఉందని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. 2019కి ముందు రాష్ట్రంలో ఉన్న పాత ప‌థ‌కాల‌తో పాటు జ‌గ‌న్ పాల‌న‌లో కొత్త‌గా పుడుపోసుకున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంద‌ని టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, ఉచిత పథకాల పేరుతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేస్తున్న అప్పుల కార‌ణంగా, రాష్ట్రంలో ఎప్పుడైనా ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించే ప‌రిస్థితి నెల‌కొంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. మ‌రోవైపు ఏపీ ప్ర‌భుత్వం పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రభుత్వ నిర్వాకంతో, రాష్ట్రంల పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయని, జ‌గ‌న్ పాల‌న‌లో అభివృద్ధి కార్యక్రమాల ఊసే ఉండటం లేదని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.