Viveka murder Case: వివేకా హత్య కుట్రలో.. సీఎం జగన్ “హ‌స్తం” ఉందా..?

  • Written By:
  • Updated On - March 5, 2022 / 05:58 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై తాజాగా టీడీపీ నేత య‌న‌మ‌న‌ల రామ‌కృష్ణ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే దివంగ‌త మాజీ ఎంపీ వివేకానంద‌రెడ్డి మ‌ర్డ‌ర్ కేసు ఏపీలో పెద్ద ఎత్తున‌ ర‌చ్చ లేపుతుంది. వివేకా కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఈ కేసు రోజుకో మ‌లుపు తిరుగుతూ రోజుకో ట్విస్టు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే సీబీఐ లీక్స్ పేరుతో టీడీపీకి అనుకూల‌మైన‌ కొన్ని ప‌త్రిక‌లు, మీడియాలు వండి వార్చుతున్న క‌థ‌నాలు, రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఈ నేప‌ధ్యంలో ఎప్పుడైతే వివేకా కేసులో ఆయ‌న కూతుతు సునీత రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం ఇదేనంటూ ఓ ప్ర‌ముఖ తెలుగు ప‌త్రిక‌లో క‌థ‌నం వ‌చ్చిందో, అప్ప‌టి నుంచి ఏపీ ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ త‌మ్ముళ్ళు జ‌గ‌న్ పై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతూ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వివేకా హత్య కేసులో సీఎం జగన్ కూడా భాగస్వామి అని టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆరోపించారు. వివేకా హత్య వెనుక నేరపూరితమైన కుట్ర ఉందనేది స్పష్టమైందని య‌న‌మ‌ల తెలిపారు.

ఈ నేప‌ధ్యంలో జగన్ మోహ‌న్ రెడ్డి కూడా వివేకా హత్యలో ముఖ్య భాగస్వామి అనేది సాక్షుల వాంగ్మూలాలను బట్టి స్పష్టంగా అర్ధమౌతోందని య‌న‌మ‌ల‌ ఆరోపించారు. ముఖ్యంగా జ‌గ‌న్‌తో పాటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నేరపూరితమైన కుట్ర పన్ని వివేకానంద‌రెడ్డిను హత్య చేశారని సీబీఐ దర్యాప్తును బట్టి అర్ధమౌతోందని స్పష్టం చేశారు. వివేకా హత్య వెనుక ఎవరున్నారో ఆయన కూతురు, అల్లుడు ఇతర కుటుంబ సభ్యులంతా సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారని య‌న‌మ‌ల‌ గుర్తు చేశారు. సాక్ష్యాధారాల చట్టం ప్రకారం వివేకా హత్య కేసులో జ‌గ‌న్, అవినాశ్ రెడ్డిల పాత్ర ఉందనటానికి సాక్ష్యాలు ఉన్నాయ‌ని, దీంతో ఈ కేసులో వారి పేర్ల‌ను కూడా సీబీఐ చేర్చాల‌ని య‌న‌మ‌ల డిమాండ్ చేశారు.

ఇక ఏపీ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సూచించారు. రాజధానిపై మరో చట్టం తీసుకురావటానికి వీల్లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉందని య‌న‌మ‌ల గుర్తు చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధానిపై చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉందిగానీ, శాసనసభకు లేదని తీర్పులో స్పష్టంగా ఆయ‌న పేర్కొన్నారు. శాసనసభ రాజ్యాంగానికి లోబడి చట్టాలు చేయాలి తప్ప వ్యతిరేకంగా చట్టం చేసే అధికారం లేదన్నారు. రాజధానిపై సీఎం జ‌గ‌న్ మూర్ఖంగా మరో చట్టం చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుంద‌న్నారు. జగన్ ఇకనైనా హైకోర్టు తీర్పును, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అమరావతిని అభివృద్ధి చేయాలి. అలా కాకుండా మూర్ఖపు వైఖరితో రాజధానిని నిర్లక్ష్యం చేస్తే హైకోర్టు తీర్పును కించపరిచినట్లే అవుతుంద‌ని యనమల హెచ్చరించారు. మ‌రి య‌న‌మ‌ల వ్యాఖ్య‌ల పై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.