Kodali Nani: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి కొడాలి నాని పరిస్థితి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నాని, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షాలపై చేసిన తీవ్ర వ్యాఖ్యలతో అప్పట్లో చర్చకు గురయ్యారు. ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్ కల్యాణ్ వంటి నాయకులపై చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశమయ్యాయి.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాని, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేవాడు మరియు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. వైసీపీలో చేరిన తరువాత, జగన్ ఆయనను టీడీపీపై ఒక ఆయుధంలా ప్రయోగించారు. నాని నాలుగు ఎన్నికల్లో విజయం సాధించినా, 2004, 2009లో టీడీపీ తరఫున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలిచారు. తర్వాత వైసీపీలో చేరడంతో, టీడీపీ ఆయనను ఓడించేందుకు 2014, 2019 ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించినా, ఫలితం లేకుండా పోయింది. జగన్ ఆయనను టీడీపీపై ప్రయోగించడం, ఆ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలతో నాని పై తన సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత పెరిగింది.
గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫలించాయి. 53,040 ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో నాని విజయయాత్రకు చెక్ పడింది. ఇక, జగన్ ఇటీవల ప్రకటించిన కొత్త పార్టీ ప్రాంతీయ కోఆర్డినేటర్ల జాబితాలో నాని పేరు కనిపించలేదు. ఆరుగురు కోఆర్డినేటర్లలో కేవలం ఒకరు తప్ప మిగితా ఐదుగురు జగన్ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. సీనియర్ నేత బొత్సకు మాత్రమే జగన్ చోటిచ్చారు. ఈ నియామకాలతో జగన్, తన పార్టీని రెడ్డి పార్టీగా స్పష్టంగా పేర్కొన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిగతా సామాజిక వర్గాలను ఆయన పల్లకీ మోసే బోయలుగానే చూస్తున్నారని విమర్శిస్తున్నారు.
2019లో వైసీపీ విజయం సాధించిన తర్వాత, నానికి జగన్ క్యాబినెట్‌లో చోటు లభించింది. కానీ, 2022లో ఆయనను క్యాబినెట్ నుంచి తప్పించారు. ఆ తరువాత, గుంటూరు, పల్నాడు కోఆర్డినేటర్‌గా నియమించారు. అయితే, ఎన్నికలకు ముందు ఆయనను ఆ పదవిలోనుంచి కూడా తప్పించి, ఎన్నికల్లో ఆయన సేవలను ఉపయోగించుకున్నారు. ఓటమి తరువాత, వైసీపీలో నాని పేరు వినిపించడం మానిపోయింది. తన సామాజిక వర్గం పట్టించుకోకపోవడం మరియు జగన్ కూడా దూరంగా ఉండటంతో, ఆయన పరిస్థితి ‘రెంటికీ చెడ్డ రేవడి’లా తయారైందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.