మచిలీపట్నంలో గైనకాలజిస్ట్‌ను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ రాధ, ఆమె భర్త డాక్టర్ మాచర్ల ఎల్ మహేశ్వరరావు గత కొన్నేళ్లుగా జవ్వాపేట్‌లో తల్లి పిల్లల ఆసుపత్రి నడుపుతున్నారు. వీరిద్దరు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆసుపత్రిని నడుపుతున్నారు. అదే ఆసుపత్రి భవనంలోని పై అంతస్తులో నివాసం ఉంటారు. అయితే మంగళవారం రాత్రి మహేశ్వరరావు రోగులను చూసేందుకు గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పై అంతస్తుకు వెళ్లి చూడగా డాక్టర్ రాధ రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వెంటనే ఆమె భర్త పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాక్టర్ రాధ మెడను కోసినట్లు గుర్తించారు. ఆమె ధరించిన నగలు కూడా మాయమైనట్లు పోలీసులు గుర్తించారు. మచిలీపట్నం డీఎస్పీ మాధవరెడ్డి, ఇనగూడూరు సీఐ ఉమామహేశ్వరరావు మృతదేహాన్ని, పరిసరాలను పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రంగంలోకి దించారు. కేసును వీలైనంత త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నగలు దోచుకునేందుకే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Murder : మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైద్యురాలు

Murder