Woman Maoist Leader : పుట్టపర్తిలో మహిళా మావోయిస్టు అగ్రనేత అరెస్ట్‌

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మ‌హిళా మ‌వోయిస్ట్ అగ్ర‌నేత అరెస్ట్ అయ్యారు. మండలంలోని మామిళ్లకుంట క్రాస్‌ వద్ద సీపీఐ

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 10:08 PM IST

సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మ‌హిళా మ‌వోయిస్ట్ అగ్ర‌నేత అరెస్ట్ అయ్యారు. మండలంలోని మామిళ్లకుంట క్రాస్‌ వద్ద సీపీఐ మావోయిస్టు పశ్చిమ కనుమల ప్రత్యేక జోన్‌ జిల్లా కమిటీ సభ్యురాలు మురువపల్లి రాజి అలియాస్‌ సరస్వతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సున్నంవారిపల్లి గ్రామానికి చెందిన మురువపల్లి రాజి నార్త్ బెంగుళూరులోని కేఆర్‌పురం అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటోంది. 45 ఏళ్ల సరస్వతి .. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని ట్రై జంక్షన్ ప్రాంతాల్లో మావోయిస్టులు జరిపిన అనేక కార్యకలాపాలకు ఆమె చీఫ్ ఆర్కిటెక్ట్ అని భావిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ మాధవ రెడ్డి తెలిపారు.

సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటగుళ్ల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ఎస్‌ఏ రావూఫ్‌ భావజాలానికి ఆకర్షితులై 1999లో రాడికల్‌ యూత్‌ ఫ్రంట్‌లో చేరారు. అప్పటి నుంచి ఆమె మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకైన సభ్యురాలుగా ఉన్నారు. ఆ తర్వాత నాయకురాలిగా, పార్టీలో కీలక సభ్యురాలుగా ఎదిగారు. రాజీ 2007లో మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ కమిటీకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న సంజయ్ దీపక్ రావును వివాహం చేసుకున్నారు. ఆమె సరస్వతి, మాధవి, పల్లవి, ప్రీతి, సంగీత వంటి మారుపేర్లతో అనేక రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగించింది.

పక్కా సమాచారంతో సత్యసాయి డీఎస్పీ వాసుదేవన్‌, ఇన్‌స్పెక్టర్లు ఎన్‌.రవీంద్రనాథ్‌, రాగిరి రామయ్య, వారి బృందం పుట్టపర్తి ప్రధాన కార్యాలయానికి 10 కిలోమీటర్ల దూరంలోని మామిళ్లకుంట క్రాస్‌ వద్ద ఆమెను పట్టుకున్నారు. ఆమె వ‌ద్ద 20,000 నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన కరపత్రాలతో సహా 14 వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆమెను కోర్టు ముందు హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇప్పటికైనా పరారీలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో చేరాలని ఎస్పీ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో జీవించేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని డీఎస్పీ హామీ ఇచ్చారు.