కొల్లేరులో వలస పక్షులు కనుమరుగవడానికి కారణాలేంటి?

వ‌ల‌స ప‌క్షుల‌కు కేరాఫ్ అయిన కొల్లేరులో పరిస్ధితి క్ర‌మంగా మారిపోతోంది. వ‌ల‌స ప‌క్షుల జాడ ఈ మ‌ధ్య‌కాలంలో ఏ మాత్రం క‌నిపించ‌డంలేదు. అందుకు కార‌ణాలేమిటో చ‌ద‌వండి..,

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:23 AM IST

కొల్లేరు సరస్సు దేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పచ్చని గ్రామాల మధ్య ఉంది. కొల్లేరు అంటేనే అనేక వలస పక్షులకు నిలయం. ఇంకా కృష్ణా, గోదావరి అనే రెండు నదుల డెల్టాల మధ్య వరదని బ్యాలెన్సింగ్ చేసే రిజర్వాయర్‌గా పనిచేస్తుంది. ఆక్వా కల్చర్, ఆక్వాఫార్మింగ్ ఇక్కడ బాగా ఫేమస్. అయితే ఏడాదికి ఏడాది ఇక్కడకు వచ్చే విదేశీపక్షుల సంఖ్య తగ్గిపోతుండటంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొల్లేరులో రానురాను విదేశీ పక్షుల కిలకిలారావాలు తగ్గిపోతున్నాయి. పదేళ్లుగా ఇక్కడ ఇదే సీన్ కనిపిస్తుంది. పెయింటెడ్ కొంగలు, ఆసియా ఓపెన్ బిల్డ్ కొంగలు, గ్రే హెరాన్‌లు, ఐబిసెస్, టీల్స్, స్పాట్-బిల్డ్ పెలికాన్‌లు ఇంకా ఎన్నో వలస పక్షులు కొల్లేరుకు తరలి వస్తాయి. నీటిమట్టం తగ్గడంతో కొల్లేరుకు వలస వచ్చే పక్షుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. నీటి మట్టంలో మార్పుకు వాతావరణ మార్పు ఒక కారణం అయితే, సరస్సు చుట్టూ ఆక్వాకల్చర్ పెరగడం సరస్సుపైనే కాదు..సమీప గ్రామాల్లో నివసించే స్థానికులపైనా ఎఫెక్ట్ చూపిస్తుంది.

కొల్లేరులో చేపలు, రొయ్యలు, ఆల్గేలను ఎక్కువగా పెంచుతారు. ఈ సరస్సులోని చాలా ప్రాంతాలను ఆక్వా కల్చర్ కోసం చిన్నచిన్న చెరువులుగా తవ్వారు. దీంతో వేసవికాలంలో సరస్సు తన అందాన్నే కోల్పోతుంది. అక్కడక్కడా కొన్ని బ్లాట్లు మినహా ఎక్కడా నీరు కనిపించడం లేదు. కానీ, సరస్సు చుట్టుపక్కల ఉన్న మత్స్య సంపదలో నీటి కొరత కనిపించడం లేదు. మత్స్యశాఖలన్నీ కొల్లేరు నుండి నీటిని మళ్లించి, ఆక్వా సాగు కోసం సరస్సులను నింపి, సరస్సును ఎండబెట్టాయి. భారీ స్థాయిలో చేపల పెంపకం కోసం ఆక్వా సాగు కోసం నీటిలో అనేక రసాయనాలు కలుపుతారు. ఇది భూమితో పాటు.. కొల్లేరు నీటిని కూడా కలుషితం చేస్తుంది. దీనివల్ల వలస పక్షులకు, చుట్టుపక్కల నివసించే ప్రజలకు ముప్పు కలుగుతుంది. కొన్నాళ్లుగా కొల్లేరు పూడిక‌తో నిండిపోతోంది. ముఖ్యంగా వ‌ర‌ద‌ల స‌మ‌యంలో వ‌చ్చే ఒండ్రు మ‌ట్టి, గుర్ర‌పు డెక్క, కిక్కిస వంటివాటితో కొల్లేరు పూడిక‌మ‌యమవుతోంది.

కేంద్రప్రభుత్వం 2009లో చిత్త‌డి నేల‌ల ప‌రిధిని పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. 2012లో కొల్లేరును ఎకో సెన్సిటివ్ జోన్‌గా ప్ర‌క‌టించింది. అయినప్పటికీ, కొల్లేరులో ప‌ర్యావ‌ర‌ణం పరిరక్షణ ప‌ట్ల నిర్ల‌క్ష్యం పెరుగుతోంద‌ని ఏలూరుకి చెందిన సామాజిక‌వేత్తలు అభిప్రాయ‌ప‌డ్డారు. కొల్లేరు కీల‌క‌మైన ప‌ర్యావ‌ర‌ణ కేంద్రమని, దాని ప‌ట్ల ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోగా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నాయని ఆరోపించారు. దీని వల్లే విదేశీ వ‌ల‌స ప‌క్షులు కూడా త‌గ్గిపోతున్నాయని చెప్పారు. గ‌తంతో పోలిస్తే అరుదైన జాతి ప‌క్షులు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఆక్ర‌మ‌ణ‌లు, ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. కొల్లేరుని కాపాడుకోవ‌డానికి త‌గిన రీతిలో చ‌ర్య‌లు చేప‌ట్టాలని కోరారు.