Nara Lokesh : లోకేష్ ప‌ప్పుకాదు..ఫైట‌ర్‌!

  • Written By:
  • Updated On - November 2, 2021 / 11:48 AM IST

క్లాస్ నుంచి మాస్ లీడ‌ర్ గా నారా లోకేష్ ఫోక‌స్ అవుతున్నాడు. ప్ర‌త్య‌ర్థులు ముద్ర‌వేసిన పప్పు ట్యాగ్ నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నాడు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన తొలి రోజుల్లో రాహుల్‌, లోకేష్ కు ప‌ప్పు ముద్రప‌డింది. ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా ఆ ముద్ర‌ను ప్ర‌త్య‌ర్థులు వేశారు. వ‌య‌సులో ఇద్ద‌రికీ 15ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. బ‌లంగా ఉన్న రాజ‌కీయ నేప‌థ్యం ఇద్ద‌రిదీ. అయిన‌ప్ప‌టికీ మాస్ లీడ‌ర్లుగా ఎద‌గ‌లేక‌పోయారు. తాజాగా రాహుల్ కంటే ముందుగా లోకేష్ ప‌ప్పు ముద్ర‌ను అధిగ‌మిస్తున్నాడు. పూర్తి స్థాయి మాస్ లీడ‌ర్ గా ఎద‌గ‌డానికి అన్ని కోణాల నుంచి త‌ర్ఫీదు పొందుతున్నాడు. ఆ మేర‌కు కొన్ని సంఘ‌ట‌న‌ల్లో విజ‌య‌సాధించాడు. అమెరికా స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకున్న లోకేష్ కు రాజ‌కీయాలు కొత్త‌. తొలి రోజుల్లో కార్య‌క‌ర్త‌ల స‌మ‌న్వ‌య క‌మిటీ క‌న్వీన‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. అన‌తికాలంలోనే తెలుగుదేశం పార్టీ స‌భ్య‌త్వాన్ని అమెరికా సైన్యం కంటే మించిన విధంగా చేయ‌గ‌లిగాడు. బీమా సౌక‌ర్యాన్ని కార్య‌క‌ర్త‌లంద‌రికీ క‌ల్పించ‌డంతో పాటు వాళ్ల కుటుంబాల‌కు అన్యాయం జ‌రిగిన‌ప్పుడు అండ‌గా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ క్లాస్ లీడ‌ర్ గా మాత్ర‌మే గుర్తింపు ఉంది. తెర వెనుక రాజ‌కీయాల‌కు మాత్ర‌మే 2014 వ‌ర‌కు ప‌రిమితం అయ్యాడు. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఆయ‌న ఇమేజ్ పై ప్ర‌త్యేక దృష్టి ప‌డింది. ఐఏఎస్ ల స‌హ‌కారంతో ఆయా శాఖ‌ల‌ను స‌మ‌ర్థంగా న‌డిపించ గ‌లిగాడు. కానీ, అస‌మ‌ర్థ నాయ‌కుని ముద్ర నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయాడు.

అధికారం కోల్పోయిన త‌రువాత లోకేష్ లో క్ర‌మంగా మార్పు క‌నిపిస్తోంది. ఆయ‌న బాడీ, భాష, ప‌రిజ్ఞానం గురించి వైసీపీ నేత‌లు త‌ర‌చూ మాట్లాడుతూ పప్పు ప‌దాన్ని బ‌లంగా రుద్దారు. దాని నుంచి బ‌య‌ట ప‌డ‌డానికి తొలుత బాడీని బాగా త‌గ్గించేశాడు. భాష‌కు ప‌దును పెట్టాడు. ఇంట్లో నుంచి ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి అలవాటు ప‌డ్డాడు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఉత్సాహంగా వెళ్ల‌డ‌మే కాకుండా త‌న సామ‌ర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాడు. సుమారు 24 కేజీల వ‌ర‌కు బ‌రువును తగ్గించాడ‌ని స‌హ‌చ‌రులు చెబుతుంటారు. డ్ర‌స్ కోడ్ ను కూడా మార్చేశాడు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్న‌ప్పుడు మ‌మ‌త బెన‌ర్జీ మాదిరిగా స్లిప్ప‌ర్స్ తో వెళుతున్నాడు. న‌డ‌వ‌డిక‌, న‌డ‌క‌, వేష‌ధార‌ణ‌, మాట‌..ఇలా అన్నింటిలోనూ మార్పు క‌నిపిస్తోంది.
ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు, కార్య‌క‌ర్త‌ల హ‌త్య‌లు, వైసీపీ దాడులు,యువ‌తుల‌పై ఆత్యాచారాలు, హ‌త్య‌లు..ఇలాంటి అంశాల‌పై ఆయ‌న చేసిన పోరాటం టీడీపీ క్యాడ‌ర్ మ‌రువ‌లేనిది. ఆ సంద‌ర్భంగా లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు, వైసీపీపై చూసిన ఆగ్ర‌హం, జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు..ఇవ‌న్నీ తెలుగుదేశం పార్టీలోని యువ‌త‌కు సంబ‌రం క‌లిగిస్తున్నాయి.

లోకేష్ ప‌ప్పు అనే వాళ్లు, చాలా మారాడు లోకేష్ అనే స్థాయికి ఎదిగాడు. కార్య‌క‌ర్త‌ల‌కు మ‌నోధైర్యం నింపుతున్నాడు. చంద్ర‌బాబు కంటే లోకేష్ ఇచ్చిన మాట మీద నిల‌బ‌డ‌తాడు అనే స్థాయికి టీడీపీ క్యాడ‌ర్ వ‌చ్చేస్తోంది. ఫ‌లితంగా క్లాస్ నుంచి మాస్ లీడ‌ర్ గా ఆయ‌న రూపాంత‌రం చెందాడు. అందుకే, ఇటీవ‌ల వైసీపీ ప్ర‌ధానంగా లోకేష్ మీద దృష్టి పెట్టింది. ఆయ‌న మీద విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్రారంభించింది. ఎదుటి వాళ్లు ఆ స్థాయిలో లోకేష్ మీద ఎగ‌సి ప‌డుతున్నారంటే..లోకేష్ తొలి విజ‌యం సాధించిన‌ట్టేన‌ని భావించ‌క త‌ప్ప‌దు.