YS Sharmila : వైఎస్ షర్మిల తన అన్న పై దండయాత్ర చేస్తుందా?

వైఎస్ షర్మిల (YS Sharmila) గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిన వార్త మీడియా హెడ్ లైట్స్ ని హిట్ చేసింది.

  • Written By:
  • Updated On - September 1, 2023 / 03:03 PM IST

By: డా. ప్రసాదమూర్తి

వైఎస్ షర్మిల (YS Sharmila) గురువారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసిన వార్త మీడియా హెడ్ లైట్స్ ని హిట్ చేసింది. వైఎస్ షర్మిల చాలా కాలంగా తెలంగాణలో తన అస్తిత్వాన్ని చాటుకోవడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ఒక బలవంతమైన లక్ష్యానికి చేరుకున్నట్టు ఈ వార్తతో అర్థమవుతుంది. షర్మిలకు, ఆమె కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మూలాలు ఆమె తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదగడానికి పెద్ద అడ్డుగా మారిన విషయం ఆమెకూ తెలుసు, మనకూ తెలుసు. ఆమె తాను నూరు శాతం తెలంగాణ బిడ్డనని, తెలంగాణలోనే పుట్టి పెరిగానని పదేపదే చెబుతూ వస్తున్నా, తెలంగాణ వారు ముఖ్యంగా బిఆర్ఎస్ నాయకులు ఆమె ఆంధ్రా మూలాలను ఎత్తిచూపి ఎద్దేవా చేస్తూనే వస్తున్నారు.

ఈ నేపథ్యంలో షర్మిల తను ఏకాకిగా అధికార పార్టీ తో ఢీకొనడం సాధ్యం కాదని స్వల్ప కాలంలోనే స్పృహలోకి వచ్చింది. ఇక అనివార్యంగా అధికార బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే రెండు పార్టీల వైపు చూడాల్సి వచ్చింది. ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. అయితే తన తండ్రి వారసత్వంగా తనలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ లౌకిక భావజాలం బీజేపీకి దగ్గర కానివ్వలేదు. అందుకే కాంగ్రెస్ వైపు ఆమె చూసింది. మారిన కాలం, మారుతున్న రాజకీయ పరిణామం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కూడా ఆమెను అక్కున చేర్చుకోవడానికి అన్ని తలుపులూ బార్లా తెరిచినట్టు కనిపిస్తోంది.

ఈ క్రమంలో షర్మిల సోనియాగాంధీని రాహుల్ ని కలిసిన వార్త ప్రాముఖ్యత సంతరించుకుంది. షర్మిల (YS Sharmila) తన పార్టీ, వైయస్సార్ టిపిని కాంగ్రెస్లో విలీనం చేయమనేది కాంగ్రెస్ పార్టీ పెట్టే ప్రధాన షరతు. దానికి షర్మిల అంగీకరించినట్టుగా కనిపిస్తోంది. సోనియా గాంధీ షర్మిలను మనసారా వాటేసుకొని, వెన్ను తట్టి, వైయస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన వారసురాలిగా షర్మిల పొలిటికల్ డైనమిజాన్ని ప్రశంసించినట్టు తెలుస్తోంది. సరే ఇదంతా చూస్తుంటే షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం తథ్యమని తేలిపోయింది. కాకపోతే షర్మిల రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానన్న పాలేరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ ఆమెకు కేటాయించగలదా అనేది పెద్ద ప్రశ్న. అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గట్టి పోటీ దారులు. ఈ నేపథ్యంలో ఆమె సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు అని మరొక వార్త.

మొత్తానికి షర్మిల కాంగ్రెస్ లో కలిసిపోయి, తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించే కూతురిలా పేరు తెచ్చుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో షర్మిల పాత్ర ఎలా ఉండబోతోంది అనేది, ఇటు కాంగ్రెస్ ముందు, అటు షర్మిల ముందు కూడా పెద్ద ప్రశ్న చిహ్నమై కూర్చుంటుంది. కాంగ్రెస్ తో కలవడం అంటే కేవలం ఒక రాష్ట్రంలో ఒక సీటు కోసం మాత్రమే కాదు కదా. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా దండు కడుతున్న గొప్ప కీలకమైన దశలో, షర్మిల కాంగ్రెస్ తో కలిసి దేశవ్యాప్త రాజకీయాల పరిణామాలలో భాగం కావలసి ఉంటుంది. అలా చూసినప్పుడు ఏపీలో తన అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి బిజెపితో పరోక్షంగా అంట కాగుతున్న తరుణంలో షర్మిల ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నదే పలువురు పలు ఊహాగానాలు చేయడానికి ఆస్కారమైంది.

కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాల కూటమి తో పాటు బిజెపిని ఎదుర్కొంటున్న సమయం ఇది. అనేక కారణాలతో బిజెపితో గట్టి బంధాన్ని కొనసాగిస్తున్న తన అన్నపై ఎలాంటి పోరాట రూపాన్ని ప్రదర్శిస్తుందో వేచి చూడాల్సిన విషయం. రాజకీయ బంధాలు వేరైనప్పుడు కుటుంబ బంధాలు ఒకటిగా కొనసాగడం అసాధ్యం. మరి షర్మిల కాంగ్రెస్ కోసం అన్నతో కూడా పోరాడుతుందా లేక ఏపీ రాజకీయాలలో జోలికి వెళ్లకుండా తన కుటుంబ సంబంధాలను కాపాడుకుంటూ, కేవలం తెలంగాణలోనే తన రాజకీయ అస్తిత్వాన్ని బలోపేతం చేసుకుంటుందా అనేది కాలమే తేల్చాలి.

Also Read:  Modi : మోడీ మెడకు మరింత బిగుసుకుంటున్న అదానీ ఉచ్చు