YS Sharmila questioned CM Chandrababu: పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. విజయవాడ వరద బాధితులకు కేంద్రం నుంచి సాయం తెస్తారా లేక ఎన్డీయే నుంచి తప్పుకుంటారా అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. విజయవాడ పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను ఈరోజు పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్బంగా బుడమేరు వరదపై టీడీపీ -వైసీపీ బురద రాజకీయాలు చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. బుడమేరు వరదకు ఇద్దరూ కారణమే అన్నారు. ఒకరు కాంట్రాక్టులు ఇచ్చారట. మరొకరు వాటిని రద్దు చేశారట అంటూ సెటైర్లు వేశారు.
ఇంత నష్టం జరిగింతే మోడీ ఎందుకు రాలేదు..
విజయవాడ వరదలకు 7 లక్షల మంది నిరాశ్రయులైతే ప్రభుత్వం నిద్రపోతోందని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు విరాళాలు తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గర కాదని, చేతనమైతే కేంద్రం నుంచి సాయం తీసుకురావాలన్నారు. వరదలకు 6800 కోట్లు నష్టం జరిగిందని బాబు చెప్పారని, ఆయన చెప్పిన నష్టం వరకు అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వస్తున్నారు..నష్టం అంచనా అంటున్నారు, రూపాయి మాత్రం కేంద్రం నుంచి రాలేదని ఆరోపించారు. ఇంత నష్టం జరిగింతే మోడీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
కేంద్రం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు..
బీజేపీ చేసిన మోసం పై చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. విజయవాడకి రైల్ నీర్ ఇవ్వాలని తాను కేంద్రమంత్రికి లేఖ రాసినా సమాధానం లేదన్నారు. విజయవాడ నుంచి ప్రతి ఏటా 6 వేల కోట్ల ఆదాయం వస్తుందని,ఇంతా ఆదాయం వస్తుంటే కేంద్రం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరమని, బాబు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ నుంచి అని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు బీజేపీ లో ఊడిగం చేస్తున్నారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. బీజేపీ నుంచి డబ్బులు తీసుకురాలేకపోతే ఎన్డీయే నుంచి తప్పుకోవాలన్నారు.