Site icon HashtagU Telugu

Pawan Kalyan: పవన్ ఆశ, ఆశయం నెరవేరడానికి ఆ 3000 సామాజికవర్గాలు మద్దతిస్తాయా?

Kapu Flaver

Pawan Janasena

పవన్ కల్యాణ్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం ఆయన పరితపిస్తుంటారు. కానీ సమాజంలో కళ్లముందున్న వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. గుంటూరుజిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ.. వీర మహిళల రాజకీయ అవగాహన, పునఃశ్చరణ తరగతులను ఏర్పాటు చేసింది. ఆ సమావేశాల్లో పవన్ కల్యాణ్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో కులాలు, మతాల చర్చే లేని రాజకీయాలు రావాలని ఆయన ఆశించారు. అందులో తప్పేమీ లేదు. అది చాలా మంది ఆశ, ఆశయం, కోరిక కూడా. మరి దానికి ఎంతవరకు సాధ్యాసాధ్య పరిస్థితులు ఉన్నాయి?

భారతదేశంలో తొలినాళ్లలో నాలుగు సామాజికవర్గాలు ఉండేవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర వర్గాలుగా వాటిని వర్గీకరించారు. అప్పుడవి కేవలం వారు చేసే వృత్తుల ఆధారంగా మాత్రమే ఏర్పాటయ్యాయి. కానీ ఇప్పుడా సామాజికవర్గ వ్యవస్థ పెరిగి పెద్దదయింది. ఆ నాలుగు సంఖ్య కాస్తా.. మూడు వేలకు చేరింది. అంటే మన దేశంలో ఇప్పుడు దాదాపు 3,000 సామాజికవర్గాలు ఉన్నాయని అంచనా. ఇవే కాకుండా వీటికి ఉప-సామాజికవర్గాలు సుమారు 25,000 ఉంటాయని మరో అంచనా.

సామాజికవర్గాల లెక్క చూస్తే.. ఎక్కడి నాలుగు.. ఎక్కడి మూడు వేలు? అసలు పోలికైనా ఉందా? అలాంటప్పుడు కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలు మన దేశంలో సాధ్యమా? వాస్తవంగా చెప్పాలంటే కష్టం. కానీ మారుతున్న కాలంతోపాటు అన్నీ మారుతుంటాయి. అందుకే ఏదీ అసాధ్యం అని కూడా చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరి వర్గంతోపాటు వారి ప్రాంతీయతను కూడా గుర్తించాలి.. గౌరవించాలి. వారి భాష, యాసలకూ అదే గుర్తింపు, గౌరవం దక్కాలి. అలా చేయనందుకే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చింది. అసలు ప్రాంతీయతను గుర్తిస్తేనే కదా జాతీయవాదం వచ్చేది. పవన్ కల్యాణ్ మాటల్లోని సారాంశం కూడా ఇదే.

జనసేనాని మాటలను పరిశీలిస్తే మరో విషయం అర్థమవుతుంది. ఇద్దరు ఎంపీలతో మొదలైన బీజేపీ ప్రయాణం… ఇప్పుడు కేంద్రంతోపాటు దాదాపు 19 రాష్ట్రాల్లో అధికారం చెలాయించే వరకు వచ్చింది. ఏ పార్టీ ప్రయాణమైనా ఇలా బుడిబుడి అడుగులతోనే ప్రారంభమవుతుందని.. అలాగే తమ పార్టీ కూడా ఎదుగుతుందని పవన్ కల్యాణ్ ఆశించారు. ఆయన ఆశపడడంతో తప్పులేదు. కానీ పార్టీ ఎదగాలంటే.. బలమైన అంశం కావాలి. దానికి కులం, మతం వంటివి ఏమాత్రం అడ్డుగోడలు కాదు. ఆ భావన ప్రజల్లోంచి పుట్టుకురావాలి. దానికి బలమైన పునాదులు వేసే నాయకులు కావాలి. పవన్ కల్యాణ్ లో ఆ ఆశయం, ఆవేశం కనిపిస్తాయి. అలాగే జనసేన అణువణువులో అదే స్ఫూర్తిని, భావాన్ని, భావజాలాన్ని నింపగలిగితేనే ఆయన ఆశయం నెరవేరే అవకాశం ఉంటుంది.

ఇక ఏపీ రాజకీయాలను ఉద్దేశించే పవన్ ఈ మాటలు అన్నారు. అందుకే వాటి విషయానికి వస్తే.. అక్కడున్నవి ప్రధానంగా మూడు పార్టీలు. తెలుగుదేశం పార్టీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీటితోపాటు బీజేపీ కూడా ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ కు పట్టు లేకపోయినా.. కొద్దోగొప్పో నాయకులు ఉన్నారు. ఇక వామపక్షాల సంగతి తెలిసిందే. ముఖ్యమైన మూడు పార్టీల విషయానికి వస్తే.. టీడీపీని కమ్మ సామాజికవర్గం పార్టీ అని వైసీపీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్.. రెడ్డి సామాజికవర్గం పార్టీ అని టీడీపీ ఆరోపిస్తోంది. జనసేన సంగతి చూస్తే.. దానిపై అలాంటి ముద్ర స్పష్టంగా పడకపోయినా.. కాపు సామాజికవర్గం పార్టీ అని ఇతర పార్టీలు అంటుంటాయి. కానీ పవన్ కల్యాణ్ మాటల్లో, చేతల్లో అలాంటిది కనపడదని ఆయన అభిమానులు అంటుంటారు. అందుకే ఆయనకు యూత్ లో ఫ్యాన్స్ ఎక్కువగా
ఉంటారు. కుల, మత రహిత సమాజాన్ని కాంక్షించే యువతరం మద్దతు ఆయనకు ఎక్కువగా లభిస్తుంది. అంటే ఏపీలో ప్రధాన పార్టీలకు ఇప్పటికే సామాజికవర్గ ముద్ర ఉంది. అలాంటప్పుడు ఆ వాసన కూడా తగలని విధంగా రాజకీయం చేయగలిగితేనే పవన్ ఆశయం సిద్ధిస్తుంది. కిందటి ఎన్నికల్లో ఒక్క సీటులో మాత్రమే గెలిచిన జనసేన.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గాని గెలుచుకుంటే పవన్ ఆశయం నెరవేరడానికి సరైన పునాది పడే అవకాశం ఉంటుంది.