AP Cabinet: జ‌గ‌న్ న‌యా కేబినెట్‌లో.. ఈ ముగ్గ‌రు వైసీపీ ఎమ్మెల్యేల‌కు చోటు ద‌క్కుతుందా..?

  • Written By:
  • Updated On - March 31, 2022 / 03:58 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధం అయిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఏప్రిల్ నెలలో రాష్ట్ర‌ కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఖాయమని, ఉగాది త‌ర్వాత ఏప్రిల్ రెండ‌వ వారంలో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జ‌గ‌న్ న‌యా మంత్రివర్గంలో ఎవ‌రికి కొత్తగా స్థానం దక్కబోతుందనేది ఇప్పుడు ఉత్కంఠరేపుతోంది. అంతే కాకుండా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరిని కొనసాగిస్తారన్నది కూడా పార్టీ వ‌ర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

ఇక మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ విష‌యంలో అంద‌రి చూపు వైసీపీలోని ముగ్గురు కీల‌క నేత‌ల పై ఉంది. ఆర్‌కె రోజా, అంబ‌టి రాంబాబు ఈ ఇద్ద‌రు వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మీడియా స‌మావేశాల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ప్ర‌తిప‌క్షాలకు కౌంట‌ర్లు ఇవ్వ‌డంలో కానీ, ఇత‌ర వేదిక‌ల‌పై కానీ, వైసీపీ వాయిస్‌ను బ‌లంగా వినిపించ‌డంలో అంబ‌టి రాంబాబు, రోజా ఇద్ద‌రు ముందుంటారు. గ‌తంలో అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ పై విమ‌ర్శ‌లు చేసే వారిలో ఈ ఇద్ద‌రే ముందండేవారు.

దీంతో తొలిసారే జ‌గ‌న్ కేబినెట్‌లో వీరిద్ద‌రికి ఛాన్స్ వ‌స్తుంద‌ని అంద‌రూ భావించారు. అయితే జ‌గ‌న్ మాత్రం ఈ ఇద్ద‌రికి మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వ‌లేదు. దీంతో నాడు ముఖ్యమంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి అప్ప‌ట్లో వైసీపీ నేత‌లు కూడా షాక్‌కు గుర‌య్యారు. రోజా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో, ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఆ త‌ర్వాత పీకేశార‌నుకోండి అది వేరే విష‌యం.. మ‌రోవైపు అంబ‌టికి ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌లేదు. అయినా త‌న వాగ్ధాటితో దిమ్మ‌తిరిగే కౌంట‌ర్లు వేస్తూ ప్ర‌త్య‌ర్ధుల‌కు చుక్క‌లు చూపించ‌డంలో అంబ‌టి రాంబాబు ముందుంటారు.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రోసారి మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వస్థీక‌ర‌ణకు రంగం సిద్ధం కావ‌టంతో, గ‌తంలో పార్టీ వాయిస్ బ‌లంగా విన్పించిన అంబ‌టి రాంబాబు, రోజాల‌కు, సీఎం జ‌గ‌న్ ఈసారైనా ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక వీరిద్దిరితో పాటు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామ‌కృష్ణారెడ్డికి కూడా జ‌గ‌న్ కొత్త కేబినెట్‌లో చోటు ద‌క్కుతుందా లేదా అనేది ఆశ‌క్తిగా మారింది. ఎందుకంటే జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు ఆళ్ళ రామ‌క్రిష్ణారెడ్డి కూడా ఎంతో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ప‌లు విష‌యాల్లో అధికార తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల‌కు గురిచేసిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌ట్లోనే, ఆళ్ళ రామ‌క్రిష్ణారెడ్డికి త‌న మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పిస్తాన‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న‌కు ఇచ్చిన హామీని జ‌గ‌న్ నిలబెట్టుకుంటారా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌రి ఈసారి జ‌గ‌న్ త‌న‌ మంత్రివ‌ర్గంలో ఎవ‌రికి ఛాన్స్ ఇస్తారో, ప్ర‌స్తుతం ఉన్న‌వారిలో ఎవ‌రిపై వేటు వేస్తారో అనేది చూడాలి.