Site icon HashtagU Telugu

Kapu factor: ఉద్ధండుల సంకీర్ణ స్కెచ్!

Kapu

Kapu

కాపు ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పోరాట ప‌టిమ గురించి అంద‌రికీ తెలుసు. సీనియ‌ర్ పొలిటిష‌య‌న్‌, కాపు జాతి ఉద్దారకుడు..ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పే స‌త్తా ఉన్న సామాజిక లీడ‌ర్‌. ఆయ‌న తాజాగా కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని టాక్‌. ఏపీలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాల నాయ‌కుల‌తో ఇప్ప‌టికే తొలి విడ‌త మీటింగ్ లు ముగిశాయ‌ని తెలుస్తోంది. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని మాజీ సీఎం చంద్ర‌బాబు స‌ర్కార్ ను ముప్పుతిప్పులు పెట్టిన ఉద్య‌మ‌కారుడు ముద్ర‌గ‌డ‌. కాపు జాతికి రిజ‌ర్వేష‌న్లు కేవ‌లం రాజ్యాధికారంతోనే వ‌స్తుంద‌ని ముద్ర‌గ‌డ‌ ప్ర‌స్తుతం భావిస్తున్నార‌ట‌. అందుకే కొత్త పార్టీని స్థాపించ‌డం ద్వారా కాపు స‌త్తాను చాటాల‌ని అడుగులు వేస్తున్న‌ట్టు ఆ సామాజిక‌వ‌ర్గంలోని గుసగుస‌లు. కాపుల రిజ‌ర్వేష‌న్ పై ప‌లు క‌మిటీల‌ను ఉమ్మ‌డి ఏపీలోనే వేయ‌డం జ‌రిగింది. అనంత‌రామ‌న్ క‌మిష‌న్ నివేదిక ప్ర‌కారం మున్నూరు కాపు, తూర్పు కాపులను ఓబీసీల కింద గుర్తించారు. కానీ, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌ద‌ని ఆ క‌మిటీ తేల్చింది. ఆ త‌రువాత భార‌త ప్ర‌భుత్వం వేసిన మండ‌ల‌ క‌మిష‌న్ నివేదిక ప్ర‌కారం కాపుల‌ను కూడా బీసీల కింద ప‌రిగణించాల‌ని సూచించింది. అయితే, ఆయా రాష్ట్రాల్లోని కాపుల ఆర్థిక‌, సామాజిక ప‌రిస్థితుల దృష్ట్యా బీసీల జాబితాలోకి చేర్చ‌డానికి వెనుక‌డ‌గు వేశాయి.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ కోసం ఆ సామాజిక వ‌ర్గం నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం 2015లో ఉద్యమాన్ని ఉదృతం చేశాడు. ఐదుశాతం కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు ఎన్నిక‌ల హామీపై ముద్ర‌గ‌డ పోరాడాడు. కిర్లంపూడి స‌మీపంలో ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ను త‌గుల‌బెట్టేంత వ‌ర‌కు సీరియ‌స్ గా ఉద్య‌మాన్ని న‌డిపాడు. ఆనాడు ఒక‌ క‌మిటీ వేయ‌డంతో చ‌ల్ల‌బ‌డ్డాడు. జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత మౌనంగా ఉన్నాడు.
కేంద్రం ఈడ‌బ్ల్యూఎస్ కోటాను ప‌ది శాతం ప్ర‌క‌టించింది. ఆ ప‌ది శాతంలో కాపుల‌కు ఐదు శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌ని 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ప్ర‌క‌టించాడు. దీంతో మిగిలిన సామాజిక‌వ‌ర్గాల నుంచి వ్య‌తిరేకత‌ను టీడీపీ చవిచూసింది. ప్ర‌త్యేకించి టీడీపీకి వెన్నుముకగా ఉండే బీసీలు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు న‌డిచారు. ఫ‌లితంగా 23 స్థానాల‌కు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ప‌రిమితం అయింది. కేంద్ర ప‌రిధిలోని రిజ‌ర్వేష‌న్ల‌పై ఎలాంటి నిర్ణ‌యం రాష్ట్రం తీసుకోలేద‌ని జ‌గ‌న్ తేల్చాడు. ప‌రోక్షంగా కాపుల రిజ‌ర్వేష‌న్ సాధ్యం కాద‌ని చెప్పేశాడు. దీంతో బీసీలు ఇప్ప‌టికే వైసీపీ ప‌క్షాన బ‌లంగా నిలుస్తున్నారు. ముంద్ర‌గ‌డ మాత్రం ఏదో ఒక విధంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని రాజకీయ ఎత్తుగ‌డ‌ను వేస్తున్నాడు. బీసీ నాయ‌కుల‌తో క‌లిసి కొత్త పార్టీని పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అందుకు సంబంధించిన మీటింగ్ పెట్టిన‌ప్ప‌టికీ బీసీల నాయ‌కుల నుంచి ఆయ‌న‌కు పాజిటివ్ సంకేతం రాలేద‌ని టాక్‌. బీసీల‌కు చెందిన నాయ‌కులు ఇటీవ‌ల తిరుప‌తి, విశాఖ‌, విజ‌య‌వాడ కేంద్రం కీల‌క మీటింగ్ లు పెట్టుకున్నారు. ముద్ర‌గ‌డ కొత్త పార్టీ ప్ర‌తిపాద‌న‌కు అనుకూలంగా మీటింగ్ లో తీర్మానం చేయ‌లేక‌పోయార‌ని తెలుస్తోంది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌డానికి బీసీ నేత‌లు వ్య‌తిరేకంగా ఉన్నారు.

ఆ క్ర‌మంలో జ‌న‌సేన‌కు సంపూర్ణ మ‌ద్ధ‌తు ఇవ్వ‌డం ద్వారా ఈసారి రాజ్యాధికారం కాపులు సంపాదించుకోవాల‌ని ముద్ర‌గ‌డ ఎత్తుగ‌డ వేశాడ‌ని తెలుస్తోంది. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా ఉన్న హ‌రిరామ‌జోగయ్య‌, ముద్ర‌గ‌డ ఇత‌ర కాపు నేత‌లు రాజ్యాధికారం దిశ‌గా స్కెచ్ వేశార‌ని పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ, టీడీపీ పార్టీల‌ను అధికారంలోకి తీసుకురావ‌డం కంటే…రాజ్యాధికారమే ల‌క్ష్యంగా కాపు నేత‌లు పెట్టుకున్నార‌ట‌. సంకీర్ణ ప్ర‌భుత్వం ఏపీలో ఏర్ప‌డితే కాపుల‌కు రాజ్యాధికారం వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నార‌ని కొంద‌రు కాపు నేత‌ల్లోని అభిప్రాయం. బీజేపీ, టీడీపీ, వైసీపీల‌కు స‌మ‌దూరం పాటించ‌డం ద్వారా రాజ్యాధికారం సాధ్య‌మ‌ని కాపుల్లోని సీనియ‌ర్లు ఉన్నార‌ని టాక్‌. సో..వాళ్ల స్కెచ్ ఎలా ఫ‌లిస్తుందో చూద్దాం!