Dharmana Prasada Rao Letter : ఆ లేఖతో మంత్రివ‌ర్గంలోకి..?

ఒకే ఒక లేఖ ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకురాబోతుందా? ఈసారి జ‌గ‌న్ క్యాబినెట్లో మిడ్ సీనియ‌ర్లు ఉండ‌బోతున్నారా? స‌బ్జెక్టు ఉన్న వాళ్ల‌కే అదృష్టం వ‌రించ‌నుందా?

  • Written By:
  • Updated On - March 22, 2022 / 04:20 PM IST

ఒకే ఒక లేఖ ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకురాబోతుందా? ఈసారి జ‌గ‌న్ క్యాబినెట్లో మిడ్ సీనియ‌ర్లు ఉండ‌బోతున్నారా? స‌బ్జెక్టు ఉన్న వాళ్ల‌కే అదృష్టం వ‌రించ‌నుందా? నోరున్న వాళ్ల‌కు అవ‌కాశం ల‌భించ‌నుందా? ప్ర‌స్తుతం ఉండే క్యాబినెట్లో మిగిలేది ఎవ‌రు ? అనేది వైసీపీ వ‌ర్గాల్లోని అంత‌ర్గ‌త చ‌ర్చ‌. కులంలేదు, మ‌తంలేదు, ప్రాంతంలేదు, బంధుప్రీతిలేదు..అంద‌రికీ ఒకే న్యాయం అంటూ జ‌గ‌న్ 2019 ఎన్నిక‌ల్లో ప‌దేప‌దే చెప్పాడు. సీఎం అయిన త‌రువాత అన్నీ చూస్తూ బంధువ‌ర్గానికి, సొంత సామాజిక‌వ‌ర్గానికి పెద్ద‌పీఠ వేయ‌డం చూశాం. ప‌లు నామినేటెడ్ , స‌ల‌హాదారుల ప‌ద‌వులే కాదు..క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లోనూ స‌మీప బంధువుల‌ను, సొంతవ‌ర్గాన్ని కొంద‌రిని కొన‌సాగించే ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని తాడేప‌ల్లి ప్యాలెస్ టాక్.

ప్ర‌స్తుతం ఉన్న క్యాబినెట్లో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిల‌ను కొన‌సాగించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబునాయుడును బ‌లంగా టార్గెట్ చేస్తోన్న మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని సొంత సామాజిక‌వ‌ర్గం కాన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మౌత్ పీస్ గా ఉన్నాడు. అందుకే, ఆయ‌న‌కు బోన‌స్ గా మంత్రి ప‌ద‌విని కొన‌సాగిస్తార‌ని తెలుస్తోంది. పైగా సొంత సామాజిక‌వర్గాన్ని కొన‌సాగించార‌నే అపవాదు నుంచి కొంత మేర‌కు త‌ప్పుకోవ‌డానికి కొడాలిని కొన‌సాగించ‌డానికి అవ‌కాశం ఉంది. స‌మీప బంధువుగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డిపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. త‌మిళ‌నాడుకు డబ్బు సంచుల‌ను త‌ర‌లిస్తూ దొరికిన కారు ఆయ‌న‌దే అంటూ అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత కూడా విద్యుత్ శాఖ‌పై ప‌లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో పాటు బొగ్గు కొనుగోళ్ల అంశంపై ప‌లు ర‌కాల అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ప్ర‌త్య‌ర్థులు చేస్తోన్న ఆరోప‌ణ‌.

మంత్రివ‌ర్గంలోని మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేల ప‌నితీరుపై జ‌గ‌న్ స‌ర్వే చేయించుకున్నాడు. ఆ స‌ర్వే సారాంశం ప్ర‌కారం ఒక‌రిద్ద‌రు మిన‌హా మంత్రివ‌ర్గం మొత్తాన్ని మార్చేయాలి. సుమారు 70 మంది ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని తాజాగా పీకే ఇచ్చిన స‌ర్వేలో ఉంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల స‌మాచారం. కానీ, బంధుప్రీతి, సామాజిక‌వ‌ర్గ అభిమానం, మౌత్ పీజ్ కార‌ణాల‌తో బాలినేనితో పాటు పెద్దిరెడ్డి, బుగ్గ‌న‌, కొడాలి మంత్రివ‌ర్గంలో కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇక మిగిలిన 20 మంది మంత్రుల‌ను మార్చ‌డానికి జ‌గ‌న్ సిద్ధం అయ్యాడు. వాళ్ల‌లో ప్ర‌ధానంగా ఈసారి రోజా, ధ‌ర్మాన ప్ర‌సాద్‌, అంబ‌టి రాంబాబు, పార్థ‌సార‌థి , శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి, ఆళ్ల రామ‌క్రిష్ణారెడ్డి త‌దిత‌రుల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ల‌లో పార్థ‌సార‌థి, శిల్పా చక్ర‌పాణిరెడ్డిల‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద రావు ఈసారి అసెంబ్లీలో అవ‌కాశం ల‌భించ‌నుంద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం ఇటీవ‌ల ఆయ‌న రాసిన లేఖ మ‌లుపు తిప్పింద‌ని స‌మాచారం. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో హైకోర్టు తీర్పును ఇస్తూ చ‌ట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును త‌ప్పుబ‌డుతూ చ‌ట్ట స‌భ‌ల‌కు ఉన్న హ‌క్కులు, న్యాయ స్థానాల పరిధి గురించి అసెంబ్లీలో చ‌ర్చించాల‌ని సీఎం జ‌గ‌న్ కు ధ‌ర్మాన లేఖ రాశాడు. అప్ప‌టికే జ‌డ్జిల‌ను విమ‌ర్శించిన వైసీపీ నేత‌లు, క్యాడ‌ర్ పై సీబీఐ విచార‌ణ న‌డుస్తోంది. దీంతో ఒక మంచి టాపిక్ ను లేవ‌నెత్తిన ధ‌ర్మాన‌పై జగ‌న్ క‌న్ను ప‌డిందట‌. పైగా ధ‌ర్మాన క్రిష్ణందాస్ ను ప్ర‌స్తుతం మంత్రివ‌ర్గం నుంచి త‌ప్పించే అవ‌కాశం ఉంది. ఆ స్థానంలో అదే కుటుంబం నుంచి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు అవ‌కాశం ఇస్తార‌ని టాక్‌. ఇక బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డిని తొలగిస్తే, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డికి అవ‌కాశం రానుంది. ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. గొలుసు పార్థ‌సార‌థి కి ఎప్పుడో జ‌గ‌న్ ప్రామిస్ చేశాడు. ఆ మేర‌కు ఆయ‌న్ను మంత్రివ‌ర్గంలోకి తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం పై వేటు ప‌డ‌నుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆయ‌న స్థానంలో రోజాకు అవ‌కాశం ఇస్తారా? లేదా ప్ర‌స్తుతం డిప్యూటీ స్పీక‌ర్ గా ఉన్న కూనంకు ఇస్తారా? అనేదానిపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఒక వేళ కూనంకు స్పీక‌ర్ ప‌ద‌వి ఇస్తే, డిప్యూటీ స్పీక‌ర్ రోజాకు ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు. మొత్తం మీద ఒక లేఖ ధ‌ర్మాన ప్ర‌సాద్ రావుకు మంత్రివ‌ర్గంలో చోటు క‌ల్పించేలా చేస్తుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్ నిజం కానుందా? లేదా చూడాలి.