Jagan Cabinet: త్వరలోనే మంత్రి వర్గ ప్రక్షాళన.. ?

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో పార్టీలో ప్రక్షాళన చేయనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన ఎవరిని అక్కున చేర్చుకోనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలకనున్నారు..? అనే అంశంపై లోతైన చర్చే నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - January 21, 2022 / 09:12 AM IST

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ త్వరలో పార్టీలో ప్రక్షాళన చేయనున్నారా..? అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఈసారి ఆయన ఎవరిని అక్కున చేర్చుకోనున్నారు..? ఎవరికి ఉద్వాసన పలకనున్నారు..? అనే అంశంపై లోతైన చర్చే నడుస్తోంది. పలువురు ఆశవహులు జగన్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. అయితే గడచిన రెండున్నరేళ్లుగా ఆయన పార్టీని పట్టించుకోలేదనే వార్తలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో జగన్ వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే పార్టీలో పలువురి పనితీరుపై సర్వే చేయించారు. ఆ సర్వే నివేదికల ప్రకారం.. జిల్లాస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఇవ్వబోతున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 151 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువమంది ఈ రెండున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసింది లేదు. అప్పుడప్పుడు సీఎం జగన్ చేసే జిల్లా పర్యటనల్లోనో, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో తప్ప. అయితే.. అందరి నేతల పనితీరుపై నిఘా పెట్టిన జగన్.. అందుకు సంబంధించిన సర్వే నివేదికలను తెప్పించుకున్నారు. ఈక్రమంలోనే వచ్చే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తంగా పార్టీలో రివ్యూ చేయబోతున్నారని తెలుస్తోంది.

నేతల పనితీరు ఆధారంగానే…

ఈ సమీక్షలకు జిల్లా ఎమ్మెల్యేలు కాకుండా… పార్టీ కోసం మొదటినుంచి పని చేస్తున్నవారు, నామినేటెడ్ పదవులు పొందినవారు, జిల్లా ఇంచార్జ్ మంత్రులు, మంత్రులు పాల్గొంటారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వారానికి ఒక జిల్లా చొప్పున ఫిబ్రవరి, మార్చి నెలల్లో పార్టీ పరిస్థితిపై రివ్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీరందరి ద్వారా ఎమ్మెల్యేల పని తీరుపై నివేదికలు తీసుకోవడంతోపాటు… ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) రివ్యూలను కూడా పరిగణలోకి తీసుకుని.. ఏప్రిల్ నెలలో ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే… ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలు పూర్తిగా పార్టీపై జగన్ దృష్టి సారిస్తారని సమాచారం. మరోవైపు త్వరలోనే కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయన్న వార్తల నేపథ్యంలో ఈ సమీక్షలు కీలకం కాబోతున్నాయని తెలుస్తోంది.

ఇప్పటికే 13 జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, అయోధ్యరామి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంచార్జులుగా ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా కూడా తమకు కేటాయించిన జిల్లాల వారీగా నేతల పనితీరుపై నివేదికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే.. వీరిలో ఇద్దరు లేదా ముగ్గురికి ఇంచార్జిలుగా బాధ్యతలు తప్పించే యోచనలో కూడా అధినేత జగన్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ మార్పులు, చేర్పుల సమయంలో కొందరు సీనీయర్లను వీరి స్థానంలో నియమిస్తారన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. మొత్తంగా చూస్తే… మంత్రిమండలి కొత్త కూర్పుకు ముందు పార్టీ పరంగానూ… ప్రభుత్వ పరంగా కీలక మార్పులైతే జగన్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈసారైనా మంత్రి పదవికోసం గంపెడాశతో ఎదురు చూస్తున్న ఆశవహుల ఆశ నెరవేరుతుందో… లేదో తెలియాలంటే… కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు.