Site icon HashtagU Telugu

CM Jagan: మంత్రివర్గం మార్పు జగన్ కు కలిసొస్తుందా? కొంపముంచుతుందా?

186517 Jagan

186517 Jagan

ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. ఇప్పుడదే చేశారు. అక్కడివరకు ఓకే. కానీ.. ఈరోజుల్లో మంత్రిపదవిని వద్దనుకునేవారు ఎవరు? కానీ, మంత్రులుగా పదవులు కోల్పోయేవారు ఇకపై మాజీలే అవుతారు. అప్పుడు వారికి ఎదురయ్యే అనుభవాలు వేరుగా ఉంటాయి. అంటే మంత్రులుగా ఉన్నప్పుడు అధికారులు కాని, పార్టీ వర్గాలు కాని, అనుచరులు కాని చెప్పింది చెప్పినట్టుగా చేస్తారు. వారికి లభించే గౌరవమర్యాదలు ఒక రేంజ్ లో ఉంటాయి. కానీ ఒకసారి మాజీ అయిన తరువాత మొత్తం వ్యవస్థ మారిపోతుంది. అంటే నిన్నటివరకు మాట విన్న వాళ్లంతా ఇకపై.. చూద్దాం, చేద్దాం అనే ధోరణితో ఉంటారు. ఇది మన రాజకీయ వ్యవస్థ లోపమా.. పద్దతా.. లేకపోతే మరొకటా అంటే చెప్పలేం. కాకపోతే దీని తీరే అంత. అందుకే క్యాబినెట్ హోదా కాదు కావలసింది.. క్యాబినెట్ లో చోటు అని చాలామంది అనుకుంటారు.

మంత్రులుగా ఉన్నప్పుడు లభించే గౌరవమర్యాదలు, దక్కే ప్రాధాన్యత అనేవి మాజీలయ్యాక ఉండవు. అందుకే మంత్రిపదవులు కోల్పోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ రెండున్నరేళ్ల వరకే మంత్రుపదవులు ఉంటాయని.. తరువాత క్యాబినెట్ ను మొత్తం మార్చేస్తానని జగన్ ముందే చెప్పారు. అందుకే ఇప్పుడున్న మంత్రులు ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. అక్కడికీ వివిధ మార్గాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరి ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఇప్పుడు చిరునవ్వుతో రాజీనామాలపై సంతకాలు పెట్టారు సరే. అదే ఆనందంతో పార్టీకోసం పనిచేస్తామని చెప్పడమూ సరే.. మరి భవిష్యత్తులో ఇలాగే జరిగితే ఏమీ కాదు. కానీ జిల్లాలో, రాష్ట్రస్థాయిలో తమ పట్టు తగ్గుతుంది అనుకున్న రోజున కథ వేరుగా ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎన్నికలకు వెళ్లే ముందు మంత్రి పదవి పోవడం అంటే ఎవరూ జీర్ణించుకోలేరు. ఎందుకంటే ఎన్నికల సమయంలో జిల్లాలో మంత్రిగా ఉన్నవారికే బలమెక్కువగా ఉంటుంది. వాళ్లు చెప్పే మాటకే విలువుంటుంది. అందుకే ఇలాంటి కీలక సమయంలో సొంతపార్టీలో ఉండే ప్రత్యర్థులకు మంత్రి పదవి వస్తే.. ఇక వీరికి ఇక్కట్లు తప్పవు. అది కూడా వీరిని బాధిస్తోందని సమాచారం. ఎందుకంటే జిల్లాలో ఈ మూడేళ్లు ఒకరి ఆధిపత్యం నడిస్తే.. ఇకపై కొత్త మంత్రుల ఆధిపత్యం నడుస్తుంది. దీనిని మాజీలు భరించగలరా? కొత్తగా వచ్చే మంత్రులకు సరైన వాయిస్ లేకపోతే అలాంటి చోట పాత మంత్రులు ఆధిపత్యం చెలాయించవచ్చు. కానీ మంత్రి పదవి వచ్చిన తరువాత ఎవరికైనా సరే.. వాయిస్ అదే వస్తుంది. గౌరవం, ప్రాధాన్యత అన్నీ అవే వస్తాయి. అందుకే పాతవారికి ఛాన్స్ ఇవ్వాలని కొత్తవారు అస్సలు కోరుకోరు. అలాంటప్పుడు మాజీల ఉనికితోపాటు రాజకీయ భవిష్యత్తు, రాజకీయ అస్తిత్వం కూడా ప్రశ్నార్థకమవుతాయి. అందుకే వారు దీనిని అంగీకరించలేరు. ఏదో ఒకరూపంలో తమ అసంతృప్తిని బయటపెడతారు. జగన్ ఈ పరిస్థితిని గమనించినందువల్లే.. మొత్తం అందరినీ మార్చేస్తానన్నా. ఇప్పుడు కొంతమంది పాతవారినే మళ్లీ మంత్రులుగా తీసుకోవడానికి సిద్ధపడినట్టు సమాచారం.

రెండున్నరేళ్ల తరువాత మొత్తం మంత్రులను మార్చేస్తానని జగన్ గతంలో చెప్పడం బాగానే ఉంది. ఒకవేళ అదే జరిగితే.. దానివల్ల కొంతమంది సమర్థులను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మంత్రివర్గంలో బాగా పనిచేసేవారు కూడా.. ఈ మొత్తం మార్పులో భాగం అవుతారు. అప్పుడు అలాంటి సమర్థుల సేవలను పొందే అవకాశం జగన్ కు లేకుండా పోతుంది. నిజానికి ఈ లెక్కలన్నీ పార్టీ పరంగా చూస్తేనే ఉంటాయి. కానీ జగన్ కు ఇవన్నీ అడ్డంకులు అవుతాయని చెప్పలేం. ప్రజల్లో అసంతృప్తి రానంతవరకు ఇలాంటి మార్పుల వల్ల తరిగేది, ఒరిగేది ఏమీ ఉండకపోవచ్చు. అదే ప్రజల్లో కాని అసంతృప్తి మొదలైతే.. ఇక అప్పుడు అసలైన రాజకీయ కష్టాలు మొదలవుతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఆయన ఎలా వ్యవహరిస్తారు.. ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నదే ఇక్కడ కీలకం.