Site icon HashtagU Telugu

Jagan Delhi Tour: జగన్ ముందస్తు ముచ్చట.. మోడీ గ్రీన్ సిగ్నల్!

Delhi Jagan

Jagan Delhi Tour Narendra Modi

ఏపీ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. బుధవారం ఉదయం దిల్లీ వెళ్లిన జగన్ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌లతో భేటీ అయ్యారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జగన్, మోదీల భేటీ జరగ్గా 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ కొనసాగినట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అమిత్ షా తో జగన్ సమావేశం సుదీర్ఘంగానే సాగింది. మోదీ కంటే ముందు అమిత్ షాతో జగన్ భేటీ అయ్యారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాలు చర్చలు జరిపారు.

ముఖ్యంగా ముందస్తు ఎన్నికల అంశం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగాల్సిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ఎన్నికలు జరిగేలా సహకరించాలని మోదీని జగన్ కోరినట్లుగా చెప్తున్నారు. అయితే.. ముందస్తు ఎన్నికల విషయంలోనూ జగన్ అందుకు సంబంధించి ముందడుగు వేస్తే ఎన్నికలు నిర్వహించడానికి ఈసీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని బీజేపీ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో జగన్ ముందస్తు ఆలోచనకు మోదీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని సీఎం కార్యాలయం చెప్తున్నప్పటికీ ఎన్నికల అంశాలపైనా ఇద్దరు నేతలపై చర్చ జరిగినట్లు వినిపిస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉండనుండడంతో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందన్న ప్రచారం కూడా దిల్లీ స్థాయిలో జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే విజయసాయిరెడ్డికి మోదీ కేబినెట్లో మంత్రి పదవి దొరకొచ్చన్న మాట వినిపిస్తోంది.

Also Read: Pawan Kalyan: పవన్ ఎంట్రీతో ఇన్‌స్టా షేక్.. 2 మిలియన్ల ఫాలోవర్స్ తో సరికొత్త రికార్డ్!