YS Jagan Assets Case : సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని ప్రశ్నించింది. పదేళ్లుగా నత్తనడకన సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను తాము ఎందుకు విచారించకూడదో చెప్పాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఈకేసులో ప్రతివాదులుగా ఉన్న జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి సహా పలువురికి నోటీసులు ఇష్యూ చేసింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటివరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. వీటి విచారణను త్వరగా పూర్తిచేసి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించట్లేదని ఆయన ఆరోపించారు. ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్‌కు ఇష్టానుసారంగా వాయిదాలు కోరే స్వేచ్ఛనిచ్చారని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈనేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా పిటిషన్‌పై సుప్రీంకోర్టు బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. జగన్ అక్రమాస్తుల కేసుకు ఎంపీ రఘురామకు సంబంధం ఏమిటని ప్రశ్నించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుదారు కాదని.. బాధితుడు కూడా కానప్పుడు ఆయనెందుకు పిటిషన్ వేశారని అడిగింది. ఫిర్యాదుదారు బాధితుడు కానప్పటికీ పిటిషన్ దాఖలు చేయొచ్చని ఎంపీ రఘురామ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. పిటిషనర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా అని కోర్టు ప్రశ్నించగా.. ఎంపీ రఘురామ కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీనే అని కోర్టుకు లాయర్ తెలిపారు. సుప్రీం కోర్టు నోటీసులకు సీబీఐ సహా ప్రతివాదులు ఎలాంటి సమాధానం ఇస్తారన్నది ఆసక్తికరంగా(YS Jagan Assets Case) మారింది.