Trouble In TDP: డేంజ‌ర్ జోన్లో టీడీపీ

`రాజ‌కీయాల్లో కేవ‌లం వ్యూహాలు మాత్ర‌మే ఉంటాయి. పౌరుషాలు ఉండ‌వు` అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య వెనుక చాలా బ‌ల‌మైన అర్థం ఉంది.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 02:34 PM IST

`రాజ‌కీయాల్లో కేవ‌లం వ్యూహాలు మాత్ర‌మే ఉంటాయి. పౌరుషాలు ఉండ‌వు` అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య వెనుక చాలా బ‌ల‌మైన అర్థం ఉంది. ఆ వ్యాఖ్య కేవ‌లం వైసీపీ గురించి ప్ర‌స్తావించిన‌ప్ప‌టికీ తెలుగుదేశం పార్టీ మీద వ్యూహాల‌కు ప‌దును పెట్టిన విష‌యాన్ని ప‌రోక్షంగా క‌ర్నూలు వేదిక‌గా ప‌వ‌న్ బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న విసిరిన వ్యూహంలో అప‌ర చాణ‌క్యునిగా పేరున్న చంద్ర‌బాబునాయుడు ప‌డిపోయారు. జ‌న‌సేన‌పార్టీ మ‌ద్ధ‌తు లేకుండా అధికారం అసాధ్య‌మ‌ని ఎన్నిక‌ల ముందే టీడీపీ భావిస్తున్న‌ట్టు ఫోక‌స్ అవుతోంది. సరిగ్గా ఈ పాయింట్ వ‌ద్ద జ‌న‌సేన బ‌లంప‌డింద‌నే సంకేతం ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లింది.

`పొత్తు కోసం టీడీపీ ముందుకొస్తే మాట్లాడ‌దాం `అంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య జ‌న‌సేన బ‌లంగా ఉన్న విష‌యాన్ని ప‌రోక్షంగా చెబుతున్నారు. క‌ర్నూల వేదిక‌గా పొత్తుపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తెలుగుదేశం పార్టీకి మ‌రింత న‌ష్టం చేకూర్చేలా ఉన్నాయ‌ని ఆ పార్టీలోని కొంద‌రి అభిప్రాయం. అంతేకాదు, వ‌న్ సైడ్ ల‌వ్ అంటూ కుప్పం ఎన్నిక‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన ఒకే ఒక వ్యాఖ్య‌ జ‌న‌సేన పార్టీ బ‌ల‌ప‌డింద‌న్న భావాన్ని ఎక్క‌డికో తీసుకెళ్లింది. లేనిబ‌లాన్ని జ‌న‌సేన ఫోక‌స్ చేసుకుంటోంది. అంతేకాదు, త్యాగాల‌కు సిద్ధం కావాలంటూ రెండు రోజుల క్రితం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్యను వ్యూహాత్మ‌కంగా ప‌వ‌న్ అనుకూలంగా మ‌లుచుకున్నారు. ఏపీ అంధ‌కారంలోకి వెళ్ల‌కుండా ఉండాలంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంద‌రూ క‌లిసి రావాలంటూ పిలుపునిచ్చారు. ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆవిర్భావ స‌భ‌లోనే ప‌వ‌న్ వెల్ల‌డించారు. త్యాగానికి సిద్దమంటూ టీడీపీ చెప్పేసింది. దీంతో మిగిలిన ప‌క్షాలు కూడా ముందుకు రావాల‌ని వ్యూహాత్మ‌కంగా పిలుపునిస్తూ కాబోయే సీఎంగా ఫోక‌స్ అవుతున్నారు జ‌న‌సేనాని ప‌వ‌న్.

వాస్త‌వంగా జ‌న‌సేన బ‌లం ఎంత అనేది ఒక‌సారి ప‌రిశీలిస్తే, 2019 ఎన్నిక‌ల్లో సుమారు 5శాతం ఓటు బ్యాంకు జ‌న‌సేన కూట‌మికి వ‌చ్చింది. ఆ ఎన్నిక‌ల్లో బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాయి. ఆ కూట‌మికి ల‌భించిన 5శాతం ఓటు బ్యాంకులో జ‌న‌సేన వంతు ఎంత అనేది టీడీపీ గ్ర‌హించాలి. జ‌న‌సేన మాత్రం ఆ 5శాతం ఓటు బ్యాంకును త‌మ సొంతమ‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు బ్యాంకును లెక్కిస్తూ 27శాతం ఓటు షేర్ జ‌న‌సేన‌కు ఉంద‌ని ప‌వ‌న్ చెబుతున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు టీడీపీ పూర్తిగా దూరంగా ఉందనే విష‌యాన్ని కూడా ఆ పార్టీ మ‌రచిపోతోంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేన ఉంటేనే అధికారం అనే మూస కోణం నుంచి టీడీపీ ఆలోచిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య ఓటు షేర్ వ్య‌త్యాసం సుమారు 10శాతం ఉంది. ఆ గ్యాప్ ను పూరించుకోవ‌డానికి జ‌న‌సేన‌కు వ‌చ్చిన 5శాతం ప్ల‌స్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటును పొంద‌గ‌లిగితే అధికారంలోకి రావ‌చ్చ‌ని ఆనాలోచిత లెక్క వేస్తోంది. జ‌న‌సేనకు కాదు దాని కూట‌మికి 5శాతం ఓటు షేర్ అనే విష‌యాన్ని టీడీపీ మ‌రిచిపోతోంది.

తొలి నుంచి ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీలు ఏపీలో బలంగా ఉండేవి. ఆ పార్టీల‌కు ఓటు బ్యాంకు క‌నీసం 4శాతం ఉంటుందని ఆ పార్టీల అంచ‌నా. జ‌న‌సేన‌కు 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓటు షేర్ లో ఉభ‌య క‌మ్యూనిస్ట్ ల షేర్ సింహ‌భాగం అనేది కామ్రేడ్ల అంచ‌నా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్ర‌బాబునాయుడు ఎందుకు జ‌న‌సేన పొత్తును కోరుకుంటున్నారు అనేది ఆ పార్టీ సీనియ‌ర్ల‌కు అంతుబట్ట‌ని ప్ర‌శ్న‌. 2014 ఎన్నిక‌ల‌కు ముందుగా పార్టీని స్థాపించిన ఆయ‌న్ను ప్ర‌జారాజ్యం పార్టీ విలీన చ‌రిత్ర వెంటాడుతోంది. ఇప్ప‌టికీ పార్టీ నిర్మాణం పూర్తిగా లేని జ‌న‌సేన ఆశీస్సుల కోసం 40శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీ ఆధార‌ప‌డేలా ప‌వ‌న్ వ్యూహాత్మ‌క గేమ్ ఆడుతున్నారు. టీడీపీ త‌డ‌బాటును గ‌మ‌నించిన ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద క‌న్నేశారు.

రాజ్యాధికారం ల‌క్ష్యంగా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్నారు. ఆ విష‌యాన్ని ప్ర‌తి వేదిక‌పైనా చెబుతున్నారు. ప్ర‌స్తుతం బీజేపీతో పొత్తు కొన‌సాగిస్తోన్న ఆయ‌న టీడీపీపై ఆడుతోన్న భ‌యంక‌ర‌మైన మైండ్ గేమ్ ను అప‌ర‌చాణ‌క్యుడు చంద్ర‌బాబు గ‌మ‌నించ‌లేక‌పోతున్నారు. గ‌తంలో ఇలాంటి మైండ్ గేమ్ ను తెలంగాణ‌లో టీఆర్ ఎస్ పార్టీ ఆడింది. అంతిమంగా టీడీపీ ఉనికిని కోల్పోయేలా చేసింది. స‌రిగ్గా ఇప్పుడు అలాంటి ఈక్వేష‌న్ జ‌న‌సేన రూపంలో ఏపీలో న‌డుస్తోంది. ఎంత‌ ఓటు షేర్ ఉందో స్ప‌ష్టంగా లేని జ‌న‌సేన తో పొత్తు కోసం వెంప‌ర్లాడేలా టీడీపీపైన ప‌వ‌న్ గేమాడుతున్నారు. ఇప్ప‌టికే ఆ గేమ్ లో విజ‌యం సాధించిన ప‌వ‌న్ రాబోవు రోజుల్లో టీడీపీ అండ‌తో సీఎం కావాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైనా జ‌న‌సేన బ‌లంపై టీడీపీ ఒక స్ప‌ష్ట‌త‌కు రావాల్సిన అవ‌స‌రం ఉంది. లేదంటే, తెలంగాణ లో టీఆర్ఎస్ వ్యూహంలో కొట్టుకుపోయిన టీడీపీ ఏపీలోనూ చేదుఅనుభ‌వాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌న‌డంలో నిజం లేక‌పోలేదు.