Site icon HashtagU Telugu

Pegasus Spyware: అంత ఉలికిపాటు ఎందుకు త‌మ్ముళ్ళూ..?

Pegasus Spyware Chandrababu

Pegasus Spyware Chandrababu

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పెద్ద బాంబు పేల్చిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ అధినేత‌ చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పై వేర్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని, 25 కోట్ల ప్రతిపాదనలతో తమ వద్దకు కూడా పెగాసస్ సంస్థ ప్రతినిథులు వచ్చారనీ, అయితే దాన్ని తాము తిరస్కరించామనీ మమతా బెనర్జీ అసెంబ్లీ అన్న‌ట్టు జోరుగా వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.

ఈ నేప‌ధ్యంలో అప్ప‌ట్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన పెగాసస్ అంశం, ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు పెగాసిస్ అంశం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఓ రేంజ్‌లో ప్ర‌కంప‌నులు రేపుతున్నాయి. ఇందుకు మ‌మ‌తా బెన‌రీనే ముఖ్య కార‌ణం అయినా, పాత మిత్రుడు చంద్ర‌బాబు పై పెగాసిస్ బాంబును ఎందుక పేల్చార‌నేది ఇప్పుడు రాజ‌కీయవ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గ‌తంలో టీడ టీడీపీకి మ‌ద్ద‌తు కోసం చంద్ర‌బాబు, మ‌మ‌తా బెన‌ర్జీ వెంట తిరిగిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఆ తర్వాత మమతా బెనర్జీకి అవసరమైనప్పుడు మాత్రం చంద్రబాబు త‌న‌దైన శైలిలో హ్యాండ్ ఇచ్చార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే పెగాస‌స్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబు పై తాజాగా మ‌మ‌తా బెన‌ర్జీ అదే అంశంపై వ్యాఖ్య‌లు చేయ‌డంతో దేశ వ్యాప్తంగా పెద్ద దుమార‌మే రేపుతుంది. అయితే చంద్ర‌బాబు హ‌యాంలో పెగాస‌స్ కొనుగోలు చేయ‌లేద‌ని టీడీపీ వ‌ర్గీయులు గ‌ట్టిగానే వాదిస్తున్నారు. ఈ క్ర‌మంలో దీనికి సంబంధించి ఆర్టీయే ద్వారా లభించిన సమాచారాన్ని టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.

ఇక‌ ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీజీపీ పదవిలో వున్నప్పుడు ఇచ్చిన వివరణను జత చేస్తున్నారు. ఇంతకీ, ఏపీలో పెగాసస్ కొనుగోలు నిజంగానే జ‌రిగిందా… చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇంటెలిజెన్స్ బాస్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుపై ఆరోపణలకు ఈ పెగాసస్ వ్యవహారానికి ఉన్న లింకేంటి, అయినా పెగాస‌స్ పేరెత్త‌గానే టీడీపీ నేత‌లు ఎందుకు అంత‌లా ఉలిక్కిప‌డుతున్నారు.. అన్ని విష‌యాలు తెలిసినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఉందా లేక‌, ఎలాంటి ఆధారాలు లేకుండానే చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు చేస్తుందా అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌నలు రేపిన‌ పెగాస‌స్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీలో పెను దుమారానికి తెర‌లేపింది. మ‌రి ఈ పెగాస‌స్ ర‌గ‌డ ఎంత దూరం వెళుతుందో చూడాలి.