Site icon HashtagU Telugu

Pulivendula: వై నాట్ పులివెందుల సెగ

Why Not Pulivendula Sega

Why Not Pulivendula Sega

Pulivendula : ఈ పార్టీకి ఏమైంది. ఒకసారిగా పార్టీలో భారీ ధిక్కార స్వరాలు వినిపించాయి. అధికారపార్టీ సభ్యులే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ్యుల కోటా ఎన్నికల్లో ఓట్లు వేయడాన్ని చూస్తే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదురుకాక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా ‘వైనాట్ 175’ అంటూ సీఎం జగన్ చాలా గంభీరమైన ప్రకటనలు చేశారు. దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఆయన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరూ విడివిడిగా 175 స్థానాల్లో పోటీ చేస్తారా? అని జగన్ సవాల్ విసిరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత స్వరం మారిందా..? భయం పట్టుకుందా..? అనే అనుమానాలు జగన్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీడియా సమావేశమైనా, బహరంగం సభ అయినా వేదిక ఏదైనా ప్రతిపక్షాలకు సవాల్ విసిరే జగన్ మోహన్ రెడ్డి శనివారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో జరిగిన సభలో ఎలాంటి ఛాలెంజ్‌లు లేకుండా చప్పగా సాగింది. స్వంత ఎమ్మెల్యేల్లోనే జగన్ విశ్వాసాన్ని కోల్పోతున్న పరిస్థితిని నిన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశాం. మొన్న జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం ఎలా ఉంటుందో జగన్‌కు టీడీపీ అభ్యర్థులు స్పష్టంగా చూపించారు. అది కూడా పులివెందుల (Pulivendula) సొంత గడ్డపై జగన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలపై కామెంట్స్ చేస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిఫెన్స్‌లో పడిపోయినట్లు దెందులూరు సభతో స్పష్టంగా అర్ధమైంది.

వైసీపీకి రాయలసీమ కంచుకోట అని ఆ పార్టీ నేతలు ధీమా చెబుతుంటారు. అదే రాయలసీమలో తూర్పు, పశ్చిమ పట్టభద్రుల రెండు స్థానాలను వైసీపీ కోల్పోయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌ను నమ్ముకున్న నెల్లూరు పెద్దారెడ్లే టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంలో కీలకంగా ఉన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు 10కి పది అసెంబ్లీ స్థానాలను అందించిన సింహపురిలో సీన్ మారుతోంది. జిల్లాలో వైసీపీ కోటకు బీటలు వారుతున్నాయి. అధికారం చేపట్టిన నాలుగేళ్ల వ్యవధిలోనే ధిక్కార స్వరాలు మోగుతున్నాయి. మొన్న జరిగిన శాసనమండలి తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఫ్యాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు పట్టభద్రులు ఓటేసి గెలిపించారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు నెల్లూరుకు చెందిన వారు ఉండటమే జిల్లాలో ఆ పార్టీ పతనం అంచున చేరిందనేందుకు నిదర్శనం. నెల క్రితం వరకు నెల్లూరు రూరల్, వెంకటగిరి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలు ఈ వరుసలో ఉండగా తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి రెబల్స్ వరుసలో చేరారు. ఇంతటి తిరుగుబాటు ఆగే సూచనలు కనిపించడం లేదు. టీడీపీ టచ్‌లో మరికొందరు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పట్టభద్ర నియోజకవర్గాలు మూడింటికి మూడూ టీడీపీ గెలుచుకోవడం వైసీపీని పెద్ద దెబ్బతీసింది. తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం కూడా ఎంతో సేపు నిలవలేదు. దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో, టీడీపీ అభ్యర్థిని గెలవనీయకుండా చేయాలని వైసీపీ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేసింది. ప్రజలలో ఆగ్రహం కట్టలు తెంచుకున్నదని, మార్పు కోసం తహతహ వ్యక్తమవుతున్నదని పట్టభద్ర ఎన్నికలు నిరూపించడంతో, శాసనసభ్యుల కోటా ఎన్నికలలో అధికారపక్షం ఆటలు సాగలేదు. ప్రజలు తాము ఇవ్వదలచుకున్న సందేశం ఇచ్చేశారు. సంక్షేమం పేరుతో పందేరాలను చేసినంత మాత్రాన ప్రజలు పడి ఉంటారనుకోవడం భ్రమ. ప్రజలకు అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి ఫలితాలలో తమకు భాగం దక్కేదాకా సంక్షేమం కూడా కావాలి. రెంటి సమతూకం కావాలి. పరిపాలనలో వారికి కూడా ఏదో స్థాయిలో భాగస్వామ్యం కావాలి. రాజధాని విషయంలో అనిశ్చిత పరిస్థితిని ఒక పదవీకాలమంతా కొనసాగించి, రోజుకొక తీరుగా మాట్లాడే సీఎం మీద ప్రజలకు ఏమి గౌరవం ఉంటుంది? దర్యాప్తు సంస్థల నుంచి కేసుల నుంచి రక్షణల కోసం ఢిల్లీ పెద్దలకు కట్టే కప్పాలను ప్రజలను గమనించలేదనుకోవద్దు. బడా కార్పొరేట్లకు అప్పనంగా భూములను, ప్రాథమిక వ్యవస్థలను అప్పగించడం ఒకటయితే, త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ఇతరులకు ధారాదత్తం చేస్తున్నా కిమ్మనలేని పరాధీనత ఈ ప్రభుత్వానిది. ఇంతకాలం అధికారంలో ఉండి ఏమి సాధించినట్టు? ఒక్క చాన్స్ అంటూ దేబిరించి, ఆ తరువాత ఏమి ఉద్ధరించినట్టు? మరోసారి ఎన్నికలకు ఏ ముఖం పెట్టుకుని వెళ్తారో జగన్‌ మోహన్ రెడ్డికి తెలియాలని పార్టీ నేతలే బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వై నాట్ పులివెందుల (Pulivendula) సెగ తాడేపల్లికి బాగా తాకినట్టు ఉంది.

Also Read:  PM Modi Telangana Tour: ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాపన..!