మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే అలకలు, విమర్శలు, ఆరోపణలు మామూలే. పదవులు ఆశించి రానివాళ్లు.. క్యాబినెట్ లో కొనసాగుతామని భావించి పదవి ఊడినవాళ్లు ఇలాంటివి చేస్తారు. కానీ ఇలాంటివాటికి జగన్ లొంగే ప్రశ్నే లేదు అంటారు. కానీ ఆ 11 మంది మంత్రులను మళ్లీ కొనసాగించడానికే ఆయన మొగ్గుచూపడంతో ఒత్తిళ్లకు లొంగిపోయారు అనే వాదనుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో చక్రం తిప్పేది ఎవరు అంటే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెబుతారు. కానీ తొలిదఫాలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన జిల్లా మొత్తం అభివృద్ధిపై కాకుండా తన సొంత నియోజకవర్గం పుంగనూరు విషయంలో మాత్రం డెవలప్ మెంట్ విషయంలో జాగ్రత్తపడ్డారు. ఒకవేళ ఆయనకు కాని మళ్లీ మంత్రి పదవి ఇవ్వకపోతే.. ఎక్కడ వేరు కుంపటి పెడతారో అన్న ఆందోళనతోనే జగన్ రెండోసారి అవకాశం ఇచ్చినట్టు వైసీపీలో టాక్ నడుస్తోంది. ఒకవేళ పెద్దిరెడ్డి కాని ఎర్రజెండా ఎగరేస్తే.. వైసీపీకి కష్టకాలం వచ్చేదని.. అందుకే జగన్ తొందరపడలేదని సమాచారం.
తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక సమయంలో పెద్దిరెడ్డి పాత్రపై విమర్శలు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలైతే ఎలా జరిగాయో తెలుసు. ఇక పుంగనూరులో అన్నీ ఏకగ్రీవాలు జరగడం అందరి దృష్టినీ ఆకర్షించింది. టీడీపీని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా పోలీస్ బలగాలను వినియోగించారన్న ప్రచారం ఉంది. కుప్పం నియోజకవర్గంలో నేతలను ప్రలోభపెట్టడానిక పెద్ద ఎత్తున ప్రయత్నించారన్న ఆరోపణలున్నాయి. దీంతో పెద్దిరెడ్డిని మార్చే విషయంలో జగన్ ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయారంటున్నాయి వైసీపీ వర్గాలు. అందుకే ఆయనను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకున్నారంటున్నారు విశ్లేషకులు.