Cabinet Equation: ఆ జిల్లాల‌కు హ్యాండిచ్చిన జ‌గ‌న్

సాధారణంగా రాష్ట్ర మంత్రివర్గం ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? సంధి సూత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి.

  • Written By:
  • Updated On - April 11, 2022 / 01:12 PM IST

సాధారణంగా రాష్ట్ర కేబినెట్ ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? సమన్యాయం అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటించాలి. అదే సమయంలో అన్ని వర్గాలకు, అన్ని జిల్లాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి. కానీ కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ అన్నట్లు ఉండరాదు. కొందరిపై ప్రేమ…మరికొందరికి మొండిచూపడం అస్సలు మంచిది కాదు. తాజాగా ఏపీ సీఎం జగన్ మంత్రివర్గం లో ఇలాంటి తప్పులెన్నో కనిపిస్తున్నాయి.

ఏపీలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాలను ఈ మధ్యే 26 జిల్లాలు చేయడం తెలిసిన సంగతే. ఉమ్మడి జిల్లాలన్నింటినికీ ప్రాధాన్యం ఇచ్చినా…కీలకమైన క్రిష్ణా, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మాత్రం ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి దక్కింది. కొత్త జిల్లాల్లో చూసుకుంటే…దాదాపు 8 కొత్త జిల్లాలకు జగన్ మంత్రివర్గంలో చోటు లేని పరిస్థితి. అంటే మొత్తం 26 జిల్లాలకు దాదాపు 30శాతం వరకు అస్సలు ప్రాతినిధ్యం ఇవ్వకపోవడం ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు..? ఇప్పుడు ఇదే ఏపీలో పెద్ద చర్చకు దారితీసింది.

ఇదే కాదు సామాజిక వర్గాల విషయాల్లోనూ పలు వర్గాల వారికి అశనిపాతంగా మారిందనే చెప్పాలి. జగన్ తొలికేబినెట్ లోనూ బ్రహ్మణ సామాజిక వర్గానికి స్థానం లేదు. ఇక రెండోసారి కేబినెట్ విస్తరణలో అలాంటి పరిస్థితే నెలకొంది. బ్రహ్మణ సామాజిక వర్గానికి అస్సలు ప్రాతినిధ్యం కల్పించలేదు. తొలి కేబినెట్ లో వైశ్య సామాజిక వర్గానికి…తాజా మంత్రివర్గంలో మొండిచెయ్యే చూపించారు. క్షత్రియ, కమ్మ సామాజిక వర్గానికి చోటు లేదు. ఓట్ల శాతాన్ని లెక్కలోకి తీసుకున్నా …ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవి ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. జిల్లాలకు సంబంధించి తీవ్ర నిరాశ చెందిన వేదన వర్ణాతీతం అనే చెప్పాలి. ఇక కొన్ని సామాజిక వర్గాల్ని జగన్ బేకాతర్ చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. జగన్ సీఎం కావడానికి మేము చేసిన ప్రయత్నాలు తెలిసి కూడా…మాకు మొండిచేయి చూపిస్తారా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట పలువురు నేతలు.