Site icon HashtagU Telugu

Pegasus Issue In AP: ‘పెగాసిస్’ పై మౌన‌మేల..!

Chandrababu Pegasus

Chandrababu Pegasus

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు పెగాసిస్ స్పైవేర్ అంశంపై మౌనంగా ఉన్నాడు. ఆయ‌న‌పై నేరుగా బెంగాల్ సీఎం మ‌మ‌త ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ సైలెంట్ అయ్యాడు. ఆయ‌న కుమారుడు లోకేశ్ మాత్ర‌మే స్పందించాడు. చంద్ర‌బాబు మౌనం వెనుక కార‌ణాలు ఏమిటి? ఎందుకు పెగాసిస్ పై సైలెంట్ అయ్యాడు? అనేది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద హాట్ టాపిక్‌.అసెంబ్లీని శాశ్వ‌తంగా బ‌హిష్క‌రించిన ఆయ‌న స‌హ‌చర ఎమ్మెల్యేలు స‌భ‌లో ఎలా వ్య‌వ‌హరించాలో డైరెక్ష‌న్ ఇస్తున్నాడు. మూడు రోజులుగా పెగాసిస్ అంశం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఆధారాల్లేని పెగాసిస్ పై చ‌ర్చ ఏమిటంటూ టీడీపీ ఎమ్మెల్మేలు నినాదాలు చేశారు. దీంతో స‌భ గంద‌ర‌గోళంగా మార‌డంతో కొంద‌రు ఎమ్మెల్యేల‌ను సోమ‌వారం స్పీక‌ర్ స‌స్సెండ్ చేశాడు. మ‌ళ్లీ అదే అంశంపై నినాదాలు చేయ‌డంతో మంగ‌ళ‌వారం మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు బ‌హిష్క‌క‌ర‌ణ‌కు గుర‌య్యారు. అసెంబ్లీలో జ‌గ‌న్ స‌ర్కార్ పెగాసిస్ మీద చ‌ర్చ జ‌రిపింది. సీఎంగా చంద్ర‌బాబు ఉన్న రోజుల్లోనే పెగాసిస్ స్పైవేర్ ను కొనుగోలు చేశార‌ని స‌భ న‌మ్మింది. ఆ మేర‌కు స‌భాసంఘాన్ని ఏర్పాటు చేస్తూ తీర్మానం చేసింది.

స‌భ‌లో జ‌రిగిన పెగాసిస్ స్పైవేర్ అంశాల‌పై క్లారిటీ ఇవ్వ‌డానికి మాజీ నిఘాధిప‌తి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు సోమ‌వారం మీడియా ముందుకొచ్చాడు. స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ సంద‌ర్భంగా చేసిన ఆరోప‌ణ‌లు అబ‌ద్దాల‌ని కొట్టిపారేశాడు. వ్య‌క్తిత్వ హ‌న‌నం, ఆరోప‌ణ‌లు చేయ‌డం కార‌ణంగా ప‌రువుపోతుంద‌ని భావించి న్యాయ‌పోరాటం చేయ‌డానికి సిద్ధప‌డ్డాడు. ఆనాడు నిఘాధిప‌తిగా ఉన్న ఆయ‌న 2019 మే నెల వ‌ర‌కు ఎలాంటి పెగాసిస్ స్పైవేర్ ప‌రిక‌రాల‌ను కొనుగోలు చేయ‌లేద‌ని చెప్పాడు. అదే విష‌యాన్ని మాజీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ కూడా తెలిపాడు. కానీ, అన‌ధికారికంగా కొనుగోలు చేశార‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అంతేకాదు, కొనుగోలు ఆర్డ‌ర్ కాపీని మాయం చేశార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్ లోని ఒక ప్రైవేటు కంపెనీ నుంచి స్పైవేర్ ను కొనుగోలు చేశార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ వాదిస్తోది. ఇదే విష‌యంపై హైకోర్టు, సుప్రీం కోర్టుల్లోనూ న్యాయ‌పోరాటం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైసీసీ చేసింది. సుప్రీం కోర్టు పిటిష‌న్ కొట్టివేయ‌గా, హైకోర్టులో స‌జ్జ‌ల వేసిన పిటిష‌న్ తాలూకూ క్లైయిట్ హాజ‌రు కాలేద‌ని ర‌ద్దు చేసింది. కానీ, స్పైవేర్ కొనుగోలు ప్రైవేటుగా చేశార‌ని జ‌గ‌న్ స‌ర్కార్ ఆరోపిస్తోంది. అంతేకాదు, ప్రైవేటు టెలికాం ప్రొవైడ‌ర్ల వ‌ద్ద ఆనాడున్న బాబు స‌ర్కార్ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను ఉన్నాయ‌ని చెబుతోంది. నిఘాధిప‌తిగా ఉన్న ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై చార్జిషీట్ న‌మోదు చేయాల‌ని కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

స్పైవేర్ ప‌రిక‌రాల కొనుగోలు విష‌యంలో సుమారు 25 కోట్ల వ్య‌వ‌హారం వివాదంగా మారింది. అధికారికంగా ఆ నిధులు ఇజ్రాయెల్ కంపెనీకి వెళ్లిన దాఖ‌లాలు లేవు. అందుకు సంబంధించిన ప‌త్రాల‌ను ప్ర‌భుత్వం సేక‌రించ‌లేక‌పోయింది. కానీ, ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై కేసు మాత్రం న‌మోదు చేయ‌డానికి కేంద్రం అనుమ‌తించింది. చంద్ర‌బాబు స‌ర్కార్ మార‌గానే ఏబీపై జ‌గన్ స‌ర్కార్ వేటు వేసింది. దానిపై కేంద్ర హోంశాఖ‌కు ఏబీ ఫిర్యాదు చేశాడు. ప‌రిశీలించిన హోంశాఖ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఛార్జిషీట్ న‌మోదు చేయాల‌ని ఆదేశించడం గ‌మ‌నార్హం.పెగాసిస్ స్పైవేర్ వ్య‌వ‌హారం గ‌త కొన్నేళ్లుగా రాజ‌కీయ వివాదంగా ఉంది. తాజాగా బెంగాల్ సీఎం మ‌మ‌త ఆ స్పైవేర్ కొనుగోలును నిర్థారించ‌డంతో దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. పైగా బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు మ‌ధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. అనేక సంద‌ర్భాల్లో ఢిల్లీ వేదిక‌గా ఇద్ద‌రూ రాజ‌కీయ ఏకాభిప్రాయంతో న‌డిచారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం చంద్ర‌బాబు ఢిల్లీలో చేసిన ధ‌ర్మ‌పోరాట దీక్ష కు ఆనాడు దీదీ మ‌ద్ధ‌తుగా నిలిచింది. క‌ర్నాట‌క‌లో కాంగ్రెస్, జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని నిల‌బెట్ట‌డానికి బీజేపీయేతర పార్టీల‌ను ఏకం చేసిన సంద‌ర్భంలోనూ చంద్ర‌బాబుతో మ‌మ‌త న‌డిచింది. 2019 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీకి మ‌ద్ధ‌తుగా జాతీయ నేత‌ల‌ను ప్ర‌చారానికి బాబు తీసుకొచ్చాడు. ఆ సంద‌ర్భంగా మ‌మ‌త బెన‌ర్జీ కూడా ఏపీకి వ‌చ్చింది. మూడు ద‌శాబ్దాలుగా ప‌ర‌స్ప‌రం ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం మ‌మ‌త‌, బాబు మ‌ధ్య ఉంది. ఫ‌లితంగా పెగాసిస్ స్పై వేర్ సాఫ్ట్ వేర్ కొనుగోలు విష‌యంలో బెంగాల్ సీఎం చేసి వ్యాఖ్య‌ల‌కు బాబు కౌంట‌ర్ ఇవ్వ‌లేక‌పోతున్నాడు. ఆమె చేసిన వ్యాఖ్య‌లపై మౌనంగా ఉన్నాడు. ఆనాడు ఇద్ద‌రి మ‌ధ్యా జ‌రిగిన పెగాసిస్ విష‌యంలో ఏమి జ‌రిగిందో చెప్ప‌డానికి సాహ‌సించ‌లేక‌పోతున్నాడు. దీంతో మ‌మ‌త చేసిన వ్యాఖ్య‌లు నిజమేనేమో…అనుకోవ‌డం స‌హ‌జం. సో..ఇప్ప‌టికైనా బాబు స్పందిస్తారా? లేక మౌనమే అంగీకార‌మా? అనేది పెగాసిస్ స్పైవేర్ ఇష్యూలోని పెద్ద ప్ర‌శ్న‌.