కడపలో ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు(Mahanadu)లో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో కార్యక్రమం జోష్‌గానే సాగింది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మహానాడు వేదికపై పలు తీర్మానాలు ప్రవేశపెట్టి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడును మళ్లీ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఈ సభలో ప్రధాన అంశంగా నిలిచింది. అయితే ఈ వేడుకకు హాజరైన పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తల మధ్య అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju, Chintakayala Ayyannapatrdu) గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ మహానాడుకు హాజరుకాలేకపోయిన విషయంపై చింతకాయల అయ్యన్నపాత్రుడు స్వయంగా స్పందించారు. ఆయన నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ హోదాలో రాజ్యాంగబద్ధమైన బాధ్యతల కారణంగా మహానాడుకు హాజరు కావలేకపోయినందుకు బాధ వ్యక్తం చేశారు. “ఈ స్థాయికి వచ్చినదానికి కారణం ఎన్టీఆర్ గారే. ఆయన తీసుకొచ్చిన పథకాలు – పేదల కోసం కిలో రెండు రూపాయల బియ్యం, ఆడపిల్లలకు ఆస్తి హక్కు – ఇవన్నీ చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు” అని ఆయన అన్నారు.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా మహానాడుకు హాజరుకాలేకపోయారు. అయితే ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం తన కుమారుడు భరత్ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. రఘురామ చంద్రబాబును కలిసి తెలుగుదేశం పార్టీకి రూ. 20 లక్షల విరాళాన్ని చెక్కు ద్వారా అందజేశారు. “ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు, ఆయనను మరవలేం. ఆయన ఆశయాలతోనే టీడీపీ ముందుకు సాగుతోంది” అంటూ రఘురామ తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మహానాడు నుంచి ఈ ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నా, తమ ఆదర్శనాయకుడైన ఎన్టీఆర్‌కు అంకితభావంతో నివాళులర్పించడం ద్వారా పార్టీపట్ల తమ కట్టుబాటును చాటిచెప్పారు.