Site icon HashtagU Telugu

Bharati Kolli : బొబ్బిలి టు చైనా.. అతిపెద్ద చైనా బ్యాంకులో తెలుగు మహిళకు కీలక పదవి

Bharati Kolli Icbc Bank Telugu Woman Chinas Largest Bank

Bharati Kolli : ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో చైనా రారాజుగా వెలుగొందుతోంది. బ్యాంకింగ్ విభాగంలో అమెరికాకు పోటీనిచ్చే రేంజు కలిగిన అతిపెద్ద బ్యాంకులు చైనాలో మాత్రమే ఉన్నాయి. ప్రపంచంలోనే నంబర్ 1 బ్యాంకు అమెరికాలో ఉంది. దాని పేరు.. ‘జేపీ మోర్గాన్ ఛేజ్’. దీని మార్కెట్ విలువ 3.83 లక్షల మిలియన్ డాలర్లు.  వరల్డ్ నంబర్ 2 బ్యాంకు చైనాలో ఉంది. దాని పేరు.. ‘ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా’(ఐసీబీసీ).  దీని మార్కెట్ విలువ 2.35 లక్షల మిలియన్ డాలర్లు. ఇంత పెద్ద ఐసీబీసీ బ్యాంకులో అత్యున్నత పదవి తెలుగు తేజం 43 ఏళ్ల  కొల్లి భారతికి(Bharati Kolli) దక్కింది. చైనాలోని ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక వ్యవస్థలకు వెన్నెముకలాంటి ఐసీబీసీ బ్యాంకులో  డైరెక్టర్ హోదాలో భారతి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని  న్యూయార్క్‌‌లో ఉన్న ఐసీబీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో డైరెక్టరుగా భారతి సేవలు అందిస్తున్నారు.

Also Read :Oreshnik Missile : తొలిసారిగా యుద్ధ రంగంలోకి ‘ఒరెష్నిక్’ మిస్సైల్.. ఏమిటిది ? ఏం చేస్తుంది ?

కొల్లి భారతి.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం వాడాడ గ్రామస్తురాలు. కొల్లి సింహాచలం, లక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె కొల్లి భారతి. వీరి రెండో కుమార్తె రూప(40) జర్మనీలోని డాయిష్ బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు.  మూడో కుమార్తె సుష్మ(38) యూకేలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా సేవలు అందిస్తున్నారు. భారతి తండ్రి కొల్లి సింహాచలం ఆర్మీ విశ్రాంత అధికారి. తల్లి లక్ష్మి గృహిణి.  ప్రస్తుతం భారతి కుటుంబం బెంగళూరులో నివసిస్తోంది. భారతి మదనపల్లెలోని జేఎన్‌టీయూసీ అనుబంధ ఎంసీబీటీ కళాశాలలో ఇంజినీరింగ్‌ చేశారు. 1999లో బెంగళూరులోని హెచ్‌పీ, డెల్‌ కంపెనీల్లో ఉద్యోగం చేశారు. 12 ఏళ్ల క్రితం డెల్‌ సంస్థ మూడునెలల ఇంటర్న్‌షిప్‌పై ఆమెను అమెరికాకు పంపింది. భారతి పనితీరు బాగుండటంతో.. డెల్ కంపెనీ అక్కడే ఆమెకు ఉద్యోగిగా అపాయింట్‌మెంట్ ఇచ్చింది.  ఆ జాబ్ చేస్తూ.. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలో భారతి ఎంబీఏ చేశారు. అనంతరం తన విద్యార్హతల ఆధారంగా చైనాకు చెందిన ఐసీబీసీ బ్యాంకుకు ఎంపికయ్యారు. న్యూయార్క్‌లోని ఐసీబీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆమె గత నాలుగేళ్లుగా డైరెక్టర్‌ హోదాలో సేవలు అందిస్తున్నారు.

Also Read :700 Crore Loan Fraud : కువైట్ బ్యాంకుకు రూ.700 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన ప్రవాస భారతీయులు