Vijayasai Reddy: వైఎస్సార్ సీపీకి కీలక నేత విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడంతో.. తదుపరిగా ఆయన ప్లేస్‌ను ఎవరు భర్తీ చేస్తారు ? అనే దానిపై చర్చ మొదలైంది. విజయసాయి రేంజులో వైఎస్ జగన్ ఎవరిని నమ్ముతారు ? అంతటి కీలక బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారు ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ తరుణంలో కొందరు ముఖ్య వైఎస్సార్ సీపీ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
Also Read :Red Light Therapy: రెడ్ లైట్ థెరపీ అంటే ఏమిటి? ఈ చికిత్స దేనికి ఉపయోగిస్తారు?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రయారిటీ
విజయసాయిరెడ్డి గత ఐదేళ్లలో ఢిల్లీ స్థాయిలో వైఎస్సార్ సీపీకి(Vijayasai Reddy) సంబంధించిన అన్ని పనులను చక్కబెట్టేవారు. ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఇంఛార్జిగానూ ఆయన వ్యవహరించారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ రాజకీయ పార్టీ తరఫున ఈ బాధ్యతలను నిర్వర్తించబోయే నేత ఎవరు ? అనే దానిపై అందరికీ ఆసక్తి నెలకొంది. వైఎస్సార్ సీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. వీరందరిలోనూ జగన్‌కు అత్యంత సన్నిహితుడైన సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకు పెద్ద స్థాయిలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టే నైపుణ్యం, ఓర్పు, సామర్థ్యం ఉన్నాయి. 2024 సెప్టెంబరులో వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించారు. దీన్నిబట్టి ఆయనకు జగన్ ఇచ్చే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వంటి నేతలు కూడా జగన్‌కు నమ్మకస్తులే.
Also Read :Republic Day Parade : ఆకట్టుకున్న ఏపీ ఏటికొప్పాక బొమ్మల శకటం
మిథున్ రెడ్డికే చాలా మంది అనుకూలం
ఇక ఎంపీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉంటారు. వైఎస్ జగన్ బంధువు ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉంటారు. అయితే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత వచ్చిన ఆరోపణలు అవినాశ్ రెడ్డికి మైనస్ పాయింట్లుగా మారాయి. ఆ కేసుల విచారణ రానున్న రోజుల్లో వేగవంతం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే అవినాశ్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించేందుకు జగన్ జంకుతున్నారని అంటున్నారు. ఈ కారణం వల్లే తన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడు మిథున్ రెడ్డిపై జగన్ ఆధారపడుతున్నారట. గత ఎన్నికల్లో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ తుడిచిపెట్టుకుపోయినా, మిథున్ రెడ్డి సహా ఆయన తండ్రి, బాబాయ్ టీడీపీ హవాను తట్టుకొని గెలవగలిగారు. దీంతో ప్రస్తుత విపత్కర పరిస్థితులను మిథున్ రెడ్డి అధిగమించగలరని ఎక్కువ మంది పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మరి వైఎస్ జగన్ ఆలోచన ఎలా ఉంటుందో వేచిచూడాలి.