Site icon HashtagU Telugu

AP TDP: ఆ టీడీపీ ఎంపీని ఢీకొట్టేదెవరు..?

Kesineni

Kesineni

2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగినా బెజవాడ పార్లమెంట్ స్థానాన్ని మాత్రం వైసీపీ దక్కించుకోలేకపోయింది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గాలి వీచిన దానికి ఎదురొడ్డి నిలిచి విజయవాడ లోక్ సభలో రెండోసారి టీడీపీ జెండాని ఎగరేశారు ఎంపీ కేశినేని నాని. 2014 ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన కేశినేని నాని.. పార్లమెంట్ లోని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేశారు. టాటా ట్రస్ట్ ద్వారా 265 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి పథంలో నడిపించారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవరఖ, కనకదుర్గ ఫ్లైఓవర్, ఇబ్ర‌హీంప‌ట్నం నుంచి తిరువూరు వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారి ని నిర్మించారు. 2019 ఎన్నిక‌ల్లోనూ రెండో సారి గెలిచిన కేశినేని నాని ప్ర‌తిప‌క్షంలో ఉండి కూడా పార్ల‌మెంట్ లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఎంపీ ల్యాండ్స్ తో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, కేంద్ర ప్ర‌భుత్వం నిధులు తీసుకువ‌చ్చి ప‌లు రోడ్లను కేశినేని నాని నిర్మించారు. తాజాగా విజ‌య‌వాడ‌లో మ‌హాన‌డు రోడ్డు నుంచి నిడ‌మానూరు వ‌ర‌కు ఆరు వ‌రుస‌ల ఫ్లైఓవ‌ర్ నిర్మాణానికి ఎన్‌హెచ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అధికారం ఉన్న లేక‌పోయిన అభివృద్ధి చేయోచ్చ‌నేది ఎంపీ కేశినేని నాని నిరూపిస్తున్నారు. ఇటీవ‌ల తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో కేంద్ర ప్ర‌భుత్వం నిధుల‌తో ఏర్పాటు చేసిన రోడ్డుని ఎంపీ కేశినేని నాని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యే ర‌క్ష‌ణ‌నిధి, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు సైతం పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఒక్క రూపాయి తెచ్చి రోడ్లు వేయించ‌లేని దుస్థితిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్ర‌తిప‌క్ష ఎంపీ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి నిధులు తీసుకువ‌చ్చి రోడ్లు వేయించ‌డం..ఆ కార్య‌క్ర‌మంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాల్గొన‌డం సొమ్ము ఒక‌డిది..సోకు ఒక‌డిది అన్న‌ట్లు ఉంద‌ని ప్ర‌తిప‌క్షనేతల్లో వినిపిస్తుంది.

ఎంపీ కేశినేని నాని త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నారు.అయితే వైసీపీ కి మాత్రం విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కు పోటీ చేయ‌డానికి అభ్య‌ర్థి క‌రువైయ్యారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున పోటీచేసిన కోనేరు రాజేంద్ర‌ప్ర‌సాద్ ఓడిపోయిన త‌రువాత సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పొట్లూరి వీర ప్ర‌సాద్ (పీవీపీ) పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి మాత్రం రెండు ఎన్నిక‌ల్లో కేశినేని నాని నే పోటీ చేశారు. వైసీపీ నుంచి మాత్రం రెండు ఎన్నిక‌ల్లో ఇద్దరు అభ్య‌ర్థులు పోటీ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా విజ‌య‌వాడ పార్ల‌మెంట్ వైసీపీకి ఇంఛార్జ్ లేరు. పార్ల‌మెంట్ ప‌రిధిలో ఎక్క‌డ అధికారిక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన పోటీ చేసిన అభ్య‌ర్థి పీవీపీ ఫోటోలు కూడా ఫ్లెక్సీల్లో క‌నిపించ‌డంలేదు. ఇటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల‌యాల్లోనూ పీవీపీ ఫోటోల‌ను తొలిగించిన ప‌రిస్థితి క‌నిపిస్తుంది.అంటే ప్ర‌స్తుతం విజ‌య‌వాడ పార్ల‌మెంట్‌కి వైసీపీ ఇంఛార్జ్ లేర‌ని స్ప‌ష్ట‌మవుతుంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి విజ‌య‌వాడ ఎంపీ క్యాండిడెట్ కోసం వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇటు టీడీపీ నుంచి మ‌ళ్లీ ఎంపీ కేశినేని నాని బ‌రిలోకి దిగి ముచ్చ‌ట‌గా మూడోసారి గెల‌వాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికి ఆయ‌న బ‌ల‌మైన పునాదిని వేసుకుంటున్నారు. 2014 నుంచి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని గ్రామాల్లోని ప్ర‌జ‌ల్లో ఎంపీ కేశినేని నానికి మంచి ఆద‌ర‌ణ ఉంది. అదే ఆద‌ర‌ణ ఇప్ప‌టికి క‌నిపిస్తుంది.ఆయ‌న ప‌ర్య‌ట‌న అంటే గ్రామాల్లో నుంచి పెద్ద ఎత్తున కార్య‌కర్త‌లు, ప్ర‌జ‌లు త‌ర‌లివ‌స్తున్నారు. అదే ఆద‌ర‌ణ‌ని కాపాడుకుంటూ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఎంపీ కేశినేని నాని ఉంటున్నారు. దీంతో ముచ్చ‌ట‌గా మూడోసారి ఎంపీగా కేశినేని నాని విజ‌యం సాధిస్తార‌ని టీడీపీ క్యాడ‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేస్తుంది. కేశినేనిని ఢీ కోట్టేందుకు వైసీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాల‌ని చూస్తున్న దొర‌క‌డం లేద‌ని వైసీపీ నాయ‌కుల్లో టాక్ వినిపిస్తుంది. మ‌రి ఎన్నిక‌ల నాటికి వైసీపీ అభ్య‌ర్థి ఎవ‌రు అవుతారో వేచి చూడాలి.