YS Sharmila : షర్మిల ఎంట్రీ ఎవరికి లాభం?

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 07:11 PM IST

డా. ప్రసాదమూర్తి

ఈసారి వైఎస్ షర్మిల(YS Sharmila) తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయ రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు ఆమె చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలో ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తినీ వినియోగించింది. అయితే అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన కోసం చేసిన త్యాగానికి, కృషికి, పోరాటానికి ప్రతిఫలంగా ఏమీ చేయలేకపోయారు. అది ఆమెను తన రాజకీయ కార్య క్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చుకునేలా చేసింది. తెలంగాణ ఎన్నికలలో ప్రత్యక్షంగా బరిలోకి దిగకపోయినా పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి ఆమె తోడ్పడి తన శక్తిని చాటుకుంది. అయితే తెలంగాణలో తన రాజకీయ ఉనికి సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ఆమె తన కార్య రంగాన్ని ఏపీకి మార్చుకుంది. స్వామి కార్యము, స్వకార్యమూ ఒకటే అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తన ఆస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, పునర్వైభవాన్ని సాధించుకోవడానికి ఒక కీలకమైన నాయకత్వం అవసరమైన సమయంలో షర్మిల అంది వచ్చింది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకోలేదు. ఆమెకు ఏపీసీసీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టి సగౌరవమైన స్థానాన్ని అందజేసింది. ఇక ఇప్పుడు షర్మిల ఏపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు పటిష్టతకు కష్టపడాల్సి ఉంది. అయితే షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది.. అది ఏ మేరకు జగన్ కి ప్రమాదంగా మారుతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

షర్మిల అన్నతో పోరాడుతుందా?

షర్మిల ముందు ఎన్నో బాధ్యతలు మరెన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన ప్రాభావాన్ని పునరుద్ధరించడానికి షర్మిల చేయవలసినది, నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు చాలా ఉన్నాయి. పార్టీ పట్ల ఏపీ ప్రజల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టాలి. రాష్ట్ర విభజన గాయాలు మాసిపోయినా, వాటి తాలూకు మచ్చలు అలాగే ఉన్నాయి. వాటి విషయంలో షర్మిల ఏపీ ప్రజలను ఏ మేరకు కన్విన్స్ చేయగలదు అనేది ఆమె సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర విభజన అన్ని పార్టీల ఆమోదంతో జరిగినదే కనుక, కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తప్పు పట్టలేరు. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తదితరాంశాల పట్ల కాంగ్రెస్ పార్టీ నిజాయితీతో కృషి చేస్తుందని ప్రజలకు నచ్చజెప్పవచ్చు. ఇదంతా చేసే క్రమంలో షర్మిల అనివార్యంగా అన్న జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ మేరకు షర్మిల జగన్ తో పోరాడగలదు అనేది ఇప్పుడు చెప్పలేం. ఎన్నికల పోరాటం అంటే అది తప్పనిసరిగా అధికారంలో ఉన్న పార్టీపై పోరాటమే. అధికారంలో ఉన్న అన్న జగన్మోహన్ రెడ్డి పై పోరాడకుండా షర్మిల కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను మళ్ళించడం సాధ్యమయ్యే పని కాదు. ఈ పోరాట క్రమంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య ఏ మేరకు ఘర్షణ వాతావరణం నెలకొంటుంది.. ఈ ఘర్షణలో వారి కుటుంబ రాజకీయాలు ఏ మేరకు తెరమీదకు వస్తాయి అనేది ముందు ముందు చూస్తాం. అయితే ఇక్కడ షర్మిల ముందు ఉన్న ప్రధానమైన కర్తవ్యం పార్టీ పునరుద్ధరణ కాబట్టి, షర్మిల అన్నతో ప్రత్యక్ష పోరాటం కంటే పార్టీ కార్యకలాపాల మీద ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం కూడా ఉంది. అలా అన్నతో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఆమె తాత్కాలికంగా పక్కన పెట్టవచ్చు. పోతే ఆమె సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీలో ఎన్నికల పోత్తులోకి వస్తాయి అనేది ఇంకా ఇదమిద్దంగా తేలని విషయం. ఒకవేళ తెలుగుదేశం, జనసేన బిజెపిని కాదని ఇతర ప్రతిపక్షాలతో పొత్తు కడితే ఆ కూటమిలో కాంగ్రెస్ కూడా చేరే అవకాశం ఉంది. అప్పుడు షర్మిల నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పడే ఓట్లలో కొంత చీలిక వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు వైయస్ జగన్ కు షర్మిల ద్వారా ప్రమాదం ఉండవచ్చు. ఒకవేళ తెలుగుదేశం జనసేన బిజెపితో పొత్తు కడితే, కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఆ కూటమిలో ఉండరు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు కలిసి ఒక కూటమిగా ఏర్పడవచ్చు. ఆ సందర్భంలో ఏపీలో ముక్కోణపు పోటీ కొన్ని కీలకమైన సీట్లలో జయాపజాలను నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ముక్కోణపు పోటీ ఒక్కోసారి అధికార పార్టీకి నష్టం చేకూర్చవచ్చు. ఒక్కోసారి లాభం చేకూర్చవచ్చు. వైయస్ షర్మిల, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అందే సాంప్రదాయక ఓటు బ్యాంకును చీలుస్తుందా.. లేక వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓట్లు చీలుస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ రెండు మూడు నెలల్లో ఎంతగా బలపడుతుంది అనే దానిమీద ఇది ఆధారపడి ఉంటుంది. బలమైన ప్రతిపక్ష కూటమికి దక్కాల్సిన ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల చీల్చితే అది జగన్ కి ఉపయోగపడుతుంది. ఆ మేరకు షర్మిల జగన్ కు ఉపయోగపడినట్టే అవుతుంది. చిత్ర విచిత్ర రాజకీయ తెరమీద ముందు ముందు ఎలాంటి దృశ్యాలు చూడాలో అప్పుడే మనం ఊహించలేం. జయాపజయాలు, అధికార ప్రతిపక్ష కూటములు, ఓట్ల గణాంకాలు అన్నీ ఒక కొలిక్కి వచ్చే సమయం ఇంకా రాలేదు. షర్మిల ఏ పాత్ర పోషించబోతుంది.. ఆమె వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనేది రానున్న కాలంలోనే స్పష్టమవుతుంది.

Read Also : UP Congress Committee: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. కార‌ణ‌మిదే..?