Site icon HashtagU Telugu

Ration Card : తెల్ల‌ రేషన్‌కార్డుకు కొత్త నిబంధనలు ఇవే..?

White Card Ap Imresizer

White Card Ap Imresizer

తెల్ల రేషన్‌ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన‌ కొత్త నిబంధనలను కేంద్రం తెరపైకి తెచ్చింది. దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. ఒకవేళ అనర్హులు కార్డులను సరెండర్‌ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 లోపు ఆదాయం ఉన్న వారు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారే కార్డులకు అర్హులని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. మాగాణి భూములు 3.5 ఎకరాల్లోపు ఉన్నవారు, బీడు భూములైతే 7.5 ఎకరాల్లోపు ఉన్నవారు రేషన్‌ కార్డు తీసుకోవడానికి అర్హులని పొందుపర్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలలోపు , పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేలు ఆదాయం వచ్చేవారు అర్హులని పేర్కొన్నారు.

వంద చదరపు మీటర్ల ఇల్లు, ఫ్లాట్‌ ఉన్నవారు, కారు, ట్రాక్టర్‌, గ్రామాల్లో రూ.1.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, పట్టణాల్లో రూ.2 లక్షల కంటే ఎక్కువ ఆదాయం, నగరాల్లో రూ.3 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే కార్డులు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో సరెండర్‌ చేయాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కంట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించని వారు మాత్రమే రేషన్‌కార్డు పొందడానికి అర్హులని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు రేషన్‌కార్డులు పొందడానికి అనర్హులు అని పేర్కొంది.గతంలో రేషన్‌ కార్డు తీసుకున్నవారు ఎవరైనా ఆర్థికంగా స్థిరపడితే సరెండర్‌ చేయాల్సిందేనని అధికారులు చెబుతున్నారు..