బద్వేల్ బైపోల్లో సెకండ్ ప్లేస్ ఏ పార్టీది..?

కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.అయితే అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య కుమార్తె దాసరి సుధాకి టికెట్ ఇవ్వడంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.

  • Written By:
  • Updated On - October 19, 2021 / 11:19 AM IST

కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.అయితే అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య కుమార్తె దాసరి సుధాకి టికెట్ ఇవ్వడంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి. దీనికి కారణం గతంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యే చనిపోయి ఉప ఎన్నికలు వస్తే వారి కుటుంబం సభ్యులకు టికెట్ ఇస్తుండటంతో సాంప్రదాయంగా వారికి ఇతర పార్టీలు మద్దతు తెలుపుతూ వచ్చాయి.సాంప్రదాయం అంటూ జనసేన,టీడీపీ పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.కానీ రెండు జాతీయ పార్టీలు మాత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఏపీలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన పార్టీ ఈ ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ బీజేపీ మాత్రం తన అభ్యర్థిని నిలబెట్టింది.అయితే ఇక్కడ బీజేపీకి జనసేన మద్దతు ఎంతవరకు లభిస్తుందనేది ప్రశ్రార్థకంగా మారింది.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో చర్చించకుండానే తాము పోటీ చేయడంలేదని ప్రకటించారు.ఆ తరువాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కడప జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి.అయితే బీజేపీ మిత్రపక్షం జనసేన మాత్రం ఇప్పటివరకు ప్రచారంలో కానీ నేతలతో సమావేశం కానీ నిర్వహించలేదు.

రాష్ట్ర విభజనతో అటు తెలంగాణలో…ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికి అక్కడ పెద్దగా ప్రభావం చూపలేదు.ఇటు ఏపీలో రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్సే కారణమని భావించిన ప్రజలు ఘోరంగా ఓడించారు. 2019 ఎన్నికల్లో సైతం ఆ పార్టీ ఎక్కడా కూడా డిపాజిట్లు తెచ్చుకోలేకపోయింది.ఇప్ప‌టి వ‌ర‌కు కూడా కాంగ్రెస్‌ని ముందుండి న‌డిపించే నాయ‌కులు లేక‌పోవ‌డంతో ఆ పార్టీకి గ‌డ్డుకాలం ఏర్ప‌డింది.రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కాంగ్రెస్‌లోని ముఖ్య‌నేత‌లు టీడీపీ,వైసీపీ పార్టీలో చేరారు.ప్ర‌స్తుతం పార్టీలో పెద్ద‌నేత‌లు జిల్లాకి ఒక్క‌రు మాత్ర‌మే మిగిలారు.

అయితే రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలుస్తుంది.ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేసినప్ప‌టికి నోటా కంటే త‌క్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వ‌చ్చాయి.అదే ఎన్నిక‌ల్లో బీజేపీ,జ‌న‌సేన ఉమ్మ‌డి అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో మూడ‌వ‌స్థానానికి వ‌చ్చింది.కానీ ఇప్పుడు బ‌ద్వేల్‌లో టీడీపీ,జ‌న‌సేన త‌ప్పుకోవ‌డం…బీజేపీ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన కూడా పోటీకి దూరంగా ఉండ‌టంతో కాంగ్రెస్‌,బీజేపీ పార్టీలు రెండ‌వ‌స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి.అయితే గ‌తంలో కంటే బీజేపీ ఏపీలో కొంత‌మేర పుంజుకుంద‌నే చెప్పాలి.ఇటు కాంగ్రెస్ కూడా బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో త‌న ప‌ట్టునిలుపుకోవాల‌ని చూస్తుంది.అయితే బీజేపీకే రెండ‌వ‌స్థానం వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.మ‌రి బ‌ద్వేల్ బైపోల్‌లో ప్ర‌జ‌లు ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీని ఆద‌రిస్తారో వేచి చూడాలి