Andhra Tiger:పెద్దపులిని పట్టుకోవడానికి ఇంత ప్రోటోకాలా? ఏపీలో ఇప్పుడది ఎక్కడుంది?

ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్ గా మారడంతో పులులు, ఇతర జంతువులు కూడా జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 12:43 PM IST

ప్రపంచమంతా కాంక్రీట్ జంగిల్ గా మారడంతో పులులు, ఇతర జంతువులు కూడా జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయి. చిరుత పులులు ఎక్కువగా వస్తాయని చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు పెద్దపులి పంజా విసరడంతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని గ్రామాలు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. ప్రత్తిపాడు మండలంలోని ఊదరమెట్టపై పెద్దపులి మకాం వేసింది అనుకున్నారు. కానీ ట్రాకింగ్ కెమెరాల్లో దాని జాడ ఎక్కడా కనిపించలేదు. పులి తిరగాడే ప్రాంతాల్లో 52 కెమెరాలను ఏర్పాటు చేసినా దాని ఆచూకీ చిక్కలేదు. ఇప్పుడది ఆహారం కోసం కొండల్లోకి వెళ్లిందా, మెట్టమీదే ఇంకా ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. గేదెను వేటాడిన తరువాత వరుసగా దానికి మూడు రోజులు ఆహారం లభించింది. అది అయిపోవడంతో ఇప్పుడు ఎటు వెళుతుంది అన్నది తెలియడం లేదంటున్నారు అధికారులు.

పెద్దపులిని పట్టుకోవాలంటే దానికి చాలా ప్రోటోకాల్ ఉంది. దానిని బంధించకపోతే పరిస్థితి చేజారిపోతుంది అన్నప్పుడు మాత్రమే బోనులో వేస్తారు. ఈ విషయంలో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందే. పులి ఎంతటి నెత్తుటి విధ్వంసానికి దిగినా సరే.. దానికి మాత్రం హాని చేయకుండా.. సౌకర్యవంతంగా దూరంగా తరలించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఐదు బోనులతోపాటు మత్తుమందుతో కూడిన తుపాకులను కూడా రెడీ చేశారు అధికారులు. పులి ఒకవేళ మెట్ట దగ్గరే ఉండే అవకాశం ఉందన్న అంచనాతో.. ఐదు కిలోమీటర్ల పరిధిలో మరిన్ని ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటుచేశారు.

పులికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన మానాన తాను వెళ్లిపోయేలా వాహనాల అలజడి, మనుషుల కదలికలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. పోలవరం గట్ల వెంబడి ఉండే రోడ్లపై స్టాపర్లు ఏర్పాటు చేసి.. అటువైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. ఇక పెద్దపులి చంపిన జంతువులకు పశువైద్యునిపుణులు నిర్ణయించిన దాని ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తారు. పెద్దపులి జాతీయ జంతువు. అందుకే దాని విషయంలో ఇంత పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది.

Pic: Representation Photo