AP CM Jagan Alternative Plan : ఆర్ 5 జోన్ విషయంలో జగన్ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి?

అమరావతి విషయంలో జగన్ (Jagan) సర్కార్ తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాలు తిరిగి ప్రభుత్వం మెడకే గుదిబండలా చుట్టుకుంటున్నాయా?

  • Written By:
  • Updated On - September 2, 2023 / 11:34 AM IST

By: డా. ప్రసాదమూర్తి

AP CM Jagan Alternative Plan :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి కీలకమైన పరిణామాలు రానున్న కాలంలో చోటుచేసుకుంటాయో తెలియదు. కానీ అమరావతి విషయంలో జగన్ (Jagan Mohan Reddy) సర్కార్ తీసుకుంటున్న, తీసుకున్న నిర్ణయాలు తిరిగి ప్రభుత్వం మెడకే గుదిబండలా చుట్టుకుంటున్నాయా? ఇలాంటి ప్రశ్నకు తాజాగా సుప్రీంకోర్టులో జగన్ కు ఎదురైన ప్రతికూల తీర్పు అవకాశం ఇస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిని కాదని, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు నిర్మిస్తానని జగన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞ మనకు గుర్తు ఉండనే ఉంది. కర్నూల్లో న్యాయవ్యవస్థ, అమరావతిలో శాసన వ్యవస్థ, వైజాగ్ లో పాలనా వ్యవస్థ ఏర్పాటు చేసి మూడు రాజధానుల నీడలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకుపోతానని జగన్ గత నాలుగేళ్లుగా చెబుతూనే వస్తున్నారు. అందుకు ప్రజలూ పెద్దగా స్పందించిన దాఖలాలూ లేవు, వాతావరణం అనుకూలించిన జాడలూ లేవు, న్యాయస్థానాలు, రాజ్యాంగం కూడా అనుకూలించిన సందర్భమూ లేదు.

అందుకే తర్వాత కాలంలో మూడు రాజధానుల పాట పాడడం పక్కన పెట్టేశారు జగన్ (Jagan). అయితే చంద్రబాబు హయాంలో ఏర్పాటు అయిన అమరావతిని అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ చంద్రబాబుకి దక్కుతుందని, అలా జరగకుండా చూడడమే తన ఏకైక ధ్యేయంగా జగన్ పావులు కదుపుతూ వచ్చారు. మూడు రాజధానుల విషయం అసాధ్యమని, ఆ ప్రతిపాదన మూడు ప్రాంతాల ప్రజల్లో ఏమంత సానుకూల ప్రకంపనలు సృష్టించలేదని ఆయన తెలుసుకున్నాక, అమరావతిలో అతి కీలకమైన ఆర్ 5 జోన్ లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పేదలకు ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించారు. నిర్ణయించడమే కాదు ఆర్ 5 జోన్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేసి నిర్మాణాలు కూడా ప్రారంభించారు. ఇది అమరావతి నియమ నిబంధనలకు, సిఆర్డిఏ చట్టపరిధికి వ్యతిరేకమైనదిగా న్యాయ నిపుణులు, అమరావతి రైతు ఉద్యమ నాయకులు, కోర్టులూ చెబుతూనే ఉన్నాయి. ఈ విషయంపై అమరావతి రైతులు హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు స్టే ఆర్డర్ జారీ చేసింది. అక్కడ ఇళ్ళ నిర్మాణం ఆపమని హైకోర్టు ఆదేశం. కోర్టుల ఆదేశాలు పెడచెవిని పెట్టి, న్యాయ సూత్రాలను, రాజ్యాంగాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లడమే పరిపాలనంటే అని భావించే జగన్ సర్కార్ మరింత ముందుకు వెళ్ళింది.

సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించింది. హైకోర్టు స్టే ఆదేశానికి విరుద్ధంగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు స్టేను తిరస్కరించమని విన్నవించుకుంది. అయితే న్యాయ ప్రక్రియ ఈ విషయంలో ఒక కొలిక్కి రాకముందే జగన్ (Jagan Mohan Reddy) సర్కార్ దుందుడుకుగా ముందుకు సాగుతూనే ఉన్నారు. శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ళ నిర్మాణం విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టే సమంజసమేనని, ఆ స్టేను నిరాకరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత జగన్ సర్కార్ ఆర్5 జోన్ జోలికి వెళ్లడం చట్టపరంగా వ్యతిరేకం. అయితే తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అనే వితండ తత్వం ఉన్న జగన్, ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. మూడు రాజధానుల మాటలో, మూడు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టి, ఆ చిచ్చును తమకు అనుకూలంగా మార్చుకోవాలన్ళ దురుద్దేశం ఉంది. ఆర్5 జోన్ విషయానికి వస్తే, రాష్ట్రంలోని ఇతర ప్రజలకు ఇళ్ళు కట్టించడం అనే నిర్ణయం ద్వారా, అమరావతి ప్రాంత పేదలకు, ఇతర ప్రాంతాల పేదలకు మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే దురాలోచన ఉంది. తాము అన్ని ప్రాంతాల ప్రజలనూ సమానంగా ఆదరిస్తామని, దీనికి అందరూ అడ్డం పడుతున్నారని చెప్తూ అన్ని ప్రాంతాల ప్రజలు మద్దతు పొందడానికి జగన్ సర్కార్ రచించిన వ్యూహంగా ఆర్ ఫైవ్ జోన్ లో పేదలకు ఇళ్ల పట్టాల వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలి అని రైతు ఉద్యమ నాయకులు, పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు ప్రయత్నాలూ న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బతిన్నాయి. ఇక జగన్ ముందు మిగిలిన ప్రత్యేక ప్రత్యామ్నాయం ఏంటో కాలమే చెప్పాలి.

Also Read:  YS Rajasekhara Reddy Death Anniversary 2023 : వైయస్ఆర్ కు మరణం అనేది లేదు