AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాలో బీజేపీకి తొలినుంచీ ఆద‌ర‌ణ త‌క్కువే. తెలుగుదేశంతో పొత్తు కార‌ణంగా అప్పుడ‌ప్పుడూ రెండు పార్టీలూ లాభ‌ప‌డ్డాయి.

  • Written By:
  • Publish Date - January 29, 2022 / 12:13 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉనికి కోసం పోరాడుతోంది. తెలంగాణ‌తో పోలిస్తే ఆంధ్రాలో బీజేపీకి తొలినుంచీ ఆద‌ర‌ణ త‌క్కువే. తెలుగుదేశంతో పొత్తు కార‌ణంగా అప్పుడ‌ప్పుడూ రెండు పార్టీలూ లాభ‌ప‌డ్డాయి. విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌ద‌శ్ కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందుకు మూడు సంవ‌త్సరాలుగా ఏపీ ప్ర‌జ‌లు బీజేపీని ఎక్క‌డ ఉంచాలో అక్క‌డే ఉంచుతున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత క‌నీసం అధ్య‌క్ష ప‌ద‌వికి స‌రైన నాయ‌కుడు లేక‌పోవ‌డంతో కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. కులాల కోణంలో ఆలోచించి బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. అయితే క‌న్నా టీడీపీ డైరెక్ష‌న్ లో ప‌నిచేస్తున్నారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న్ను తప్పించి ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న సోము వీర్రాజుకు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కాని ఈయ‌న వ‌చ్చాక కూడా ఏపీలో బీజేపీకి ఒరిగిందేమీ లేదు. ఒక ఎంపీ సీటుకు, మ‌రో ఎమ్మెల్యే సీటుకు జ‌రిగిన ఉప ఎన్నిక‌లోనూ ప్ర‌జ‌లు చావు దెబ్బ కొట్టారు. బీజేపీ నాయ‌కులు ఎన్ని ఎత్తులు వేస్తున్నా, ఎన్ని ర‌కాల ప్ర‌యోగాలు చేస్తున్నా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డంలేదు.

వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో అనేక చోట్ల హిందూ ఆల‌యాల‌పై దాడులు జ‌రిగాయి. వీటికి వైసీపీ ప్ర‌భుత్వ ధోర‌ణే కార‌ణ‌మ‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌ట్ట‌డానికి చేసిన ప్ర‌య‌త్నాలు కూడా స‌ఫ‌లం కాలేదు. ప్ర‌తి దానికి వైసీపీకి ముడిపెడుతూ చేసిన విమ‌ర్శ‌లు కూడా ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డంలేదు. క‌రోనా కాలంలో ప్ర‌భుత్వానికి ఆదాయం త‌గ్గిన స‌మయంలో కూడా పేద‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం, వారి అక్కౌంట్ల‌లోకి న‌గ‌దు బ‌దిలీ చేయ‌డంతో బీజేపీ విమ‌ర్శ‌ల‌ను ప్ర‌జ‌లు ఖాత‌రు చేయ‌లేదు. ఎంత చేసినా, ఎన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసినా ప్ర‌జ‌లు కాషాయ పార్టీని న‌మ్మ‌డంలేదు. ఆ మ‌ధ్య అమిత్ షా ఏపీకి వ‌చ్చిన‌పుడు పార్టీ నాయ‌క‌త్వానికి క్లాస్ పీకారు. ఎదుగు బొదుగు లేకుండా చేస్తున్నార‌ని, ఎగ్రెస్సివ్ గా వెళ్ళాల‌ని దిశా నిర్దేశం చేశారు.

ఏపీ ప్ర‌జ‌లు త‌మ‌ను గుర్తించ‌డంలేద‌ని తీవ్రంగా మ‌ధ‌న‌ప‌డుతున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు కొంత‌కాలంగా రూట్ మార్చారు. క‌ష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ సాయం తీసుకురాక‌పోగా అన‌వ‌స‌ర విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అప‌వాదు మీద వేసుకున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ఏమైనా లాభం పొందాల‌ని ఆయ‌న భావించారు. కొత్త స‌మ‌స్య‌లు తామే సృష్టించ‌ల‌ని డిసైడ్ అయ్యారు. దేశానికి స్వ‌తంత్రం రాక‌ముందు క్విట్ ఇండియా ఉద్య‌మ కాలంలో గుంటూరు న‌గ‌రంలో నిర్మించిన జిన్నా ట‌వ‌ర్ పేరు మార్చాల‌ని, లేదా కూల్చేస్తామ‌ని ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. దేశ విభ‌జ‌న‌కు కార‌కుడైన జిన్నా పేరుతో ఇంకా గుంటూరు న‌గ‌రంలో ట‌వ‌ర్ అవ‌స‌ర‌మా అని నానా మాట‌లు అంటున్నారు. జిన్నా దేశ విభ‌జ‌న‌కు కార‌కుడు కావ‌చ్చు. కాని ఆ నిర్మాణం చ‌రిత్ర‌కు సాక్ష్యం.

దాన్ని నిర్మించిన‌పుడు జిన్నాకు దేశంలో మ‌హాత్మాగాంధీకి ఉన్నంత పేరు ఉంది. జిన్నా ట‌వ‌ర్ కూల్చాల‌న్న డిమాండ్ కు ప్ర‌జ‌ల నుంచి ఎటువంటి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో విశాఖ నగ‌రంలోని కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి పేరు మార్చాల‌ని డిమాండ్ ముందుకు తెచ్చారు. కింగ్ జార్జ్ హాస్పిట‌ల్ 175 సంవ‌త్స‌రాల క్రితం బ్రిటిష్ వారి కాలంలో నిర్మించారు. అందువ‌ల్ల నాటి ఇంగ్లండ్ రాజు పేరు దానికి పెట్టారు. ఈ అనుచిత డిమాండ్ల‌కు మేధావ‌ల నుంచి వ‌చ్చిన ప్ర‌శ్న‌లు, స‌వాళ్ళ‌తో సోము వీర్రాజు అండ్ టీమ్ నోళ్ళు మూత‌ప‌డ్డాయి. దేశ రాజ‌ధాని న‌గ‌రంలో ఇప్ప‌టికీ అనేక రోడ్ల‌కు మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల పేర్లే ఉన్నాయి. ఆగ్రాలో ప్ర‌పంచ వింత‌ల్లో ఒక‌టైన తాజ్ మ‌హ‌ల్ ఉంది. దేశంలో అనేక చారిత్ర‌క‌, వార‌స‌త్వ క‌ట్ట‌డాలు ముస్లిం రాజులు, మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు, బ్రిటిష‌ర్లు నిర్మించిన‌వి ఉన్నాయి. వాటికి వారి పేర్లే ఉన్నాయి. వాట‌న్నిటి పేర్లు మార్చి ఆ త‌ర్వాత ఏపీలో క‌ట్ట‌డాల పేర్లు మార్చాలంటూ డిమాండ్ చేయండంటూ చీవాట్లు పెట్ట‌డంతో కాషాయ నేతలు సైలెంట్ అయ్యారు.

ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఏపీ ప్ర‌జ‌ల్ని దారికి తెచ్చుకోలేక‌పోతున్నామ‌న్న ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్న సోము వీర్రాజు రాష్ట్రంలో ప్రాంతాల మ‌ధ్య‌, ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చు పెట్టాల‌నే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. రాయ‌ల‌సీమ‌లో విమానాశ్ర‌యాల మీద మాట్లాడుతూ..హ‌త్య‌లు చేసే క‌డ‌ప జిల్లాలో ఎయిర్ పోర్టు కావాలా అంటూ ఎగ‌తాళి చేశారు. క‌డ‌ప జిల్లాలో హంత‌కులే నివ‌సిస్తున్న‌ట్లు దేశంలో ఇంకెక్క‌డా నేరాలు జ‌ర‌గ‌న‌ట్లు క‌డ‌ప జిల్లా ప్ర‌జ‌ల్ని అవ‌మానిస్తూ చేసిన కామెంట్స్ కు రాయ‌ల‌సీమ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న వ‌చ్చింది.

కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, క‌మ్యూనిస్టు పార్టీల నాయ‌కులు సోము మాట‌లపై మండిప‌డ్డారు. పాపం బీజేపీ రాయ‌ల‌సీమ నేత‌లు మాత్రం త‌మ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిని స‌మ‌ర్థించ‌లేక అలాగని ఇత‌ర పార్టీల నాయ‌కుల్లా విమ‌ర్శించ‌నూలేక‌ మౌనం పాటించారు. ఆలోచ‌న లేకుండా నోరు జారినందుకు పార్టీకి జ‌రిగిన డ్యామేజ్ తో సోము దారికి వ‌చ్చారు. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల‌కు సారీ చెప్పారు. రాష్ట్రానికి ఎలాంటి మేలు చేయ‌క‌పోగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌, కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సోము వీర్రాజు లాంటి నాయ‌కుల‌తో ఏపీలో బీజేపీ ఎప్ప‌టికైనా ఎదుగుతుందని న‌మ్మ‌గ‌ల‌మా?