AP Politics: బ్రదర్ అనిల్ మీటింగ్ లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కొత్త రాజకీయాలకు తెర తీయడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు, షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ ఈ విషయంలో కీరోల్ పోషిస్తున్నారు.

  • Written By:
  • Updated On - March 8, 2022 / 11:38 AM IST

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. కొత్త రాజకీయాలకు తెర తీయడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు, షర్మిల భర్త అయిన బ్రదర్ అనిల్ ఈ విషయంలో కీరోల్
పోషిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆయన వివిధ వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ఆమధ్య ఉండవల్లిని కూడా కలిశారు. పైగా త్వరలో శుభవార్త అని హింట్ కూడా ఇచ్చారు. దీంతో కొత్త పార్టీ రాక ఖాయం అయినట్టు తెలుస్తోంది. ఇది సరే.. మరి విజయవాడ మీటింగ్ లో ఆ నాలుగు గంటలు ఏం జరిగింది?

బ్రదర్ అనిల్ కు రెండేళ్లుగా జగన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదా? విజయవాడ మీటింగ్ లో అనిల్ ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. ఇప్పటికే జగన్ సోదరి, అనిల్ భార్య షర్మిల.. తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పాదయాత్రలు కూడా చేస్తున్నారు. మరిప్పుడు బ్రదర్ అనిల్ కూడా వైఎస్ఆర్ ఏపీ పార్టీ అంటూ కొత్త పార్టీకి స్కెచ్ వేశారా? ఆ నాలుగు గంటల సమావేశమే దీనికి కీలకంగా మారిందా?

రాజకీయపార్టీ పెట్టే అలోచన లేదని పైకి చెబుతున్నా.. ఆయన వేస్తున్న అడుగులు, పాల్గొంటున్న సమావేశాలు కొత్తపార్టీ దిశగనే సాగుతున్నాయి. అందులోనూ ఉండవల్లితో భేటీ అయిన తరువాత విజయవాడలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం సంఘాల ప్రతినిధులతోపాటు ముగ్గురు మహిళలు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి గల్లీగల్లీలో తిరిగిన నేతలనే బ్రదర్ అనిల్ మీటింగ్ కు పిలిచారు. అందుకే వారితోనే చర్చలు జరిపారు.

విజయవాడలో జరిగిన నాలుగు గంటల సమావేశంలో బ్రదర్ అనిల్ కు .. జగన్ పాలనపై స్పష్టమైన అవగాహన వచ్చిందని తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో వారికి మేలు జరగలేదన్నది ఆయనకు అర్థమైనట్టు సమాచారం. పాస్టర్లకు ఒక్క నెల మాత్రమే రూ.5000 గౌరవ వేతనం ఇచ్చారని, తరువాత ముఖం చాటేశారని పాస్టర్లంతా గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది.

అసలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేని అనిల్.. ఇప్పుడు ఈ హడావుడి అంతా ఒక స్కెచ్ ప్రకారమే చేస్తున్నారా? విజయవాడ మీటింగ్ లో ఆయనకు క్లారిటీ రావడంతో.. అతి త్వరలో వైజాగ్ లేదా గుంటూరులో మరో సమావేశం నిర్వహించే ప్లాన్ లో ఉన్నారు. అది సరే. మరి విజయవాడ మీటింగ్ కు హాజరైన సంఘాల ప్రతినిధులతోనే వేరే చోట మళ్లీ మీటింగ్ పెట్టడానికి కారణమేంటి? అంటే బ్రదర్ అనిల్ కదలికలపై నిఘా ఉందని అనుమానిస్తున్నారా? బ్రదర్ అనిల్ మీటింగ్ లో దాదాపు 30 మంది ప్రతినిధులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాలతో ఏపీలో పొలిటికల్ హీట్ తారస్థాయికి చేరుకుంది.