ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా కాలంగా వేధిస్తున్న అడవి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అడవి ఏనుగుల గుంపులు పంటల నాశనం చేస్తూ రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రత్యేక చొరవ తీసుకుని, కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఫలితంగా కర్ణాటక ప్రభుత్వం నుంచి నాలుగు కుంకీ ఏనుగులు (Kumki Elephants) ఆంధ్రప్రదేశ్‌కు అందించాయి. వీటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్‌కు తరలించి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు.
కుంకీ ఏనుగుల ప్రత్యేకత
‘కుంకీ’ అనే పదం పర్షియన్ భాషలోని “కుమక్” అనే పదం నుంచి వచ్చిందిగా, దాని అర్థం “సాయం” అని. కుంకీ ఏనుగులు ప్రత్యేక శిక్షణ పొందినవై, అడవి ఏనుగులను నియంత్రించడంలో సహాయపడతాయి. అడవిలో సంచరించే ఏనుగుల గుంపులను భయపెట్టి తరిమి కొట్టే శక్తి వీటిలో ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం అందించిన దేవా, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే నాలుగు కుంకీ ఏనుగులతో ఏపీకి ఊరట కలుగనుంది. ఈ ఏనుగులకు మహత్‌లు ప్రత్యేక శిక్షణ ఇస్తూ, ఏపీ మావటీలను కూడా నైపుణ్యం కలిగించనున్నారు.
శిక్షణ, నియంత్రణలో కీలకం – మగ ఏనుగుల పాత్ర
కుంకీ ఏనుగులుగా సాధారణంగా మగ ఏనుగులనే ఎంపిక చేస్తారు. ఇవి శారీరకంగా బలంగా ఉండటమే కాకుండా, అడవిలో ఒంటరిగా తిరిగే స్వభావం కలిగివుంటాయి. మస్త్ అనే హార్మోనల్ దశలో వీటి ప్రవర్తనకు నియంత్రణ అవసరం అయినా, అనుభవజ్ఞులైన మాహుత్‌ల ఆధ్వర్యంలో ఈ ఏనుగులు ఆదేశాలను పాటిస్తూ పని చేస్తాయి. మగ ఏనుగులను చిన్నపాటి నుంచే శిక్షణ ఇచ్చి, దశలవారీగా గజదాడుల నివారణకు సిద్ధం చేస్తారు. ఈ కుంకీ ఏనుగుల రాకతో ఏపీ రైతులకు ఊరట కలిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.