Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ ఏపీలోని మంగళగిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియానుద్దేశించి మాట్లాడారు. ‘‘పాలనా సౌలభ్యం కోసం ఒకేచోట రాజధాని ఏర్పాటుచేసి, అభివృద్ధిని వికేంద్రీకరించాలన్నది టిడిపి విధానం. గతఅయిదేళ్లుగా ప్రజారాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులన్నింటినీ అధికారంలోకి వచ్చాక ప్రారంభిస్తాం. వచ్చే 10 ఏళ్లలో సమర్థమైన ప్రభుత్వం ఉంటేనే ఈ కష్టాల నుంచి గట్టెక్కగలం. రాష్ట్రంలో ప్రతి గడపకు సురక్షితమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటాం. జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లాయి’’ అని లోకేశ్ అన్నారు.
‘‘చంద్రబాబు మొదలుపెట్టిన పనులు కొనసాగించి ఉంటే లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవి. రెండు నెలలు ఓపిక పడితే ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం. భావప్రకటన స్వేచ్ఛను వైసీపీ ప్రభుత్వం కాలరాసింది. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించిన మహిళలపై పేటిఎం బ్యాచ్ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారు, వారిపై ఎలాంటి చర్యలు లేవు. నా తల్లిని కూడా అవమానించారు’’ అని అన్నారు.
మహిళలను గౌరవించే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తాం. చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా నారాయణస్వామి అసభ్య పదజాలంతో అవమానిస్తే ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదు. పైగా ప్రతిపక్షనేతలను బాగా తిడితేనే టిక్కెట్లు ఇస్తామని జగన్ నిస్సిగ్గుగా ఆ పార్టీవారికి చెబుతున్నారు. ఇటువంటి వారికి ఓటుతోనే ప్రజలు బుద్దిచెప్పాల్సి ఉందని నారా లోకేశ్ అన్నారు.