Site icon HashtagU Telugu

AP Politics: ముందస్తుకు మేం రెడీ.. జగన్ కు బాబు సవాల్!

Jagan Vote for Note

Chandra Babu Naidu Vs Jagan Mohan Reddy Ap Politics

ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన టీడీపీ నూతనోత్సహంతో కదం తొక్కుతోంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు. టీడీపీ సిద్ధంగా లేదనే అంచనాతో ముందస్తుకి వెళ్లి ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది జగన్ పగటికలే అవుతుందని చెప్పారు. జగన్‌ ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి షాక్‌ ట్రీట్‌ మెంట్‌ ఇచ్చారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాశ్వత చికిత్స చేస్తారని ఎద్దేవా చేశారు.

తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిన వైసీపీ తిరిగి తమపైనే నిందలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు చంద్రబాబు. ఇతర పార్టీలనుంచి ఏ ఎమ్మెల్యే వచ్చినా రాజీనామా చేసే రావాలని జగన్‌ అసెంబ్లీలో అనలేదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటాలో టీడీపీకి రావాల్సిన ఒక సీటు కోసం పోటీ చేయడం అనైతికమనడం బుద్ధిలేని తనం కాక మరేంటని అన్నారు. వైసీపీలో నేతలు బానిసల్లా బతుకుతున్నారని, చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌ లో ఉన్నారని తెలిపారు.

ఎన్నికల ఫలితాలపై సజ్జల ఒకటంటే, మంత్రి బొత్స మరొకటి అంటున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వైఫల్యం ఉందన్న మంత్రి బొత్స రాజీనామా చేయొచ్చుకదా అన్నారు చంద్రబాబు. గతంలో ఏది మంచి? ఏది చెడు? అనే విశ్లేషణ ఉండేదని.. ఇప్పుడు ఎదురుదాడి తప్ప మరొకటిలేదని తెలిపారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించడమే తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.