Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేశారు. అనంతరం డుంబ్రిగుడలో నిర్వహించిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. అడవి తల్లిని నమ్ముకుంటే మనకు బువ్వ పెడుతుంది.. నీడనిస్తుందని పవన్‌కల్యాణ్ అన్నారు. అడవి, ప్రకృతిపై నాకు అపారమైన ప్రేమ, గౌరవం ఉన్నాయి. అరకు అద్భుతమైన ప్రాంతం.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలి. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రజల జీవనశైలి మెరుగుపరచాలి. ఈ ప్రాంతంలో రోడ్లు బాగుండాలి అన్నారు.
Read Also: MLA quota MLCs : ప్రమాణ స్వీకారం చేసిన ఏడుగురు కొత్త ఎమ్మెల్సీలు
సీఎం చంద్రబాబును గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే 24 గంటల్లో రూ.49 కోట్లు మంజూరు చేశారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్లకు రూ.92 కోట్లే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలోపే రూ.1,500 కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం. టెండర్లు కూడా పిలిచాం. వారంరోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతంలో కూటమి పార్టీలకు ఓట్లు పడకపోయినా మీ బాగోగులు చూడటానికి మేం ఉన్నాం. ప్రభుత్వాలు, పార్టీలు మారుతుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగాలి అని పవన్‌కల్యాణ్ అన్నారు. ఇక అంతకుముందు పవన్‌కల్యాణ్ పెదపాడు గ్రామంలో గిరిజనులతో భేటీ అయ్యారు. స్థానిక సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంటసేపు మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.